కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో ఎమ్మెల్యే అయ్యిండు : సీఎం రేవంత్

కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో ఎమ్మెల్యే అయ్యిండు  : సీఎం రేవంత్

గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలనలో కేసీఆర్ ను ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొని.. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని, అదే సమయంలో మేనేజ్ మెంట్ కోటాలో కేటీఆర్ సిరిసిల్ల టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. గతం గురించి చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరితే ఒకరోజు సెషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

గతంలో జరిగిన పాపాల్లో బీఆర్ఎస్ సభ్యుల్లో చాలామందికి కూడా భాగం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ పార్టీ అధినేతను మెప్పించేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని కడియం శ్రీహరిని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షం నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను తాము ఎప్పుడు స్వీకరిస్తామని చెప్పారు. 

అంతకుముందు.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. గవర్నర్‌ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు.