న్యూయార్క్కు దీటుగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్

న్యూయార్క్కు దీటుగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్
  • పదేండ్లు టైం ఇవ్వండి.. గొప్ప నగరంగా తీర్చిదిద్దుతం: సీఎం రేవంత్​ రెడ్డి
  • ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
  • గ్రీన్​ఫీల్డ్  రేడియల్​ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ
  • నా కోసమో, మంత్రుల కోసమో కాదు.. భవిష్యత్  తరాల కోసమే ‘ఫ్యూచర్​ సిటీ’
  • డిసెంబర్​లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తం
  • అప్పటి నుంచి నెలలో మూడు రోజులు ఇక్కడే కూర్చుంట
  • ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా.. ఫ్యూచర్​ సిటీ ఆఫీస్​లోనే చర్చిస్త
  • ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్​ చేస్తం
  • భూములు కోల్పోతున్న వారి కష్టం, నష్టం అర్థం చేసుకుంట
  • వారితో నేనే కూర్చొని మాట్లాడుత.. అన్ని రకాలుగా ఆదుకుంటం
  • ఫ్యూచర్​ సిటీ నుంచే బెంగళూరుకు బుల్లెట్​ ట్రైన్ ఉంటదని సీఎం వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: తనకు పదేండ్ల  టైం ఇస్తే న్యూయార్క్​లో ఉన్నోళ్లు కూడా భారత్​ ఫ్యూచర్​ సిటీని చూసి వచ్చామనే విధంగా ఫ్యూచర్​ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నరు. ఫ్యూచర్​ సిటీలో రేవంత్​ రెడ్డికి భూములు ఉన్నాయంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నరు. నా కోసమో, మంత్రివర్గ సహచరుల కోసమో ఫ్యూచర్​ సిటీ నిర్మించడం లేదు.. భవిష్యత్​ తరాల ఫ్యూచర్​ కోసమే కడ్తున్నం” అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్​ మండలం మీర్​ఖాన్​పేటలో భారత్​ ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి ఆదివారం సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రావిర్యాల నుంచి ఆమనగల్​ వరకు నిర్మించనున్న గ్రీన్​ఫీల్డ్  రేడియల్​ రోడ్-1 నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​ మాట్లాడారు. ‘‘నెలకు మూడు సార్లు నేను వచ్చి ఇక్కడే కూర్చుంట. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీవాళ్లయినా పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వచ్చినా.. సెక్రటేరియెట్​లో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫీస్‌‌లో కూర్చొని చర్చిస్త. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్త. డిసెంబర్‌‌లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడుత” అని సీఎం పేర్కొన్నారు.  ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫీస్, రోడ్లు, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడు వస్తదో అని అనుకోవద్దని, డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటామని ఆయన వెల్లడించారు.

 ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం, కష్టం వచ్చి ఉండొచ్చునని.. వాళ్ల నష్టాన్ని, కష్టాన్ని అర్థం చేసుకొని.. వాళ్లని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు వేస్తే వచ్చే పరిహారం తక్కువ ఉంటుందని.. అవుట్​ ఆఫ్​ ద కోర్టు మాట్లాడుకుని భూములకు తగిన పరిహారం తీసుకోవాలని సూచించారు. ‘‘మీ ప్రాంతం ఏది అంటే భారత్​ ఫ్యూచర్​ సిటీ అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లు కూడా ‘భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చాను’ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఈ నగరాన్ని నిర్మిస్తం. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ‘ఎక్కడ ఉంటావు నువ్వు? నీ ప్రాంతం ఏది?’ అంటే, ‘నాది భారత్ ఫ్యూచర్ సిటీ’ అని మీరు చెప్పుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది” అని పేర్కొన్నారు. అమెరికా గురించో, జపాన్ గురించో, జర్మనీ గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో... 70 ఏండ్ల నుంచి  చెప్పుకుంటున్నామని.. ఇకనైనా మన గురించి అందరూ చెప్పుకునేలా ఎదగాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. 

సింగరేణికి 10 ఎకరాలు

ఫ్యూచర్​ సిటీలో సింగరేణికి 10 ఎకరాల భూమిని కేటాయిస్తామని.. సింగరేణి కార్పొరేట్​ ఆఫీస్​ ఇక్కడి నుంచే పనిచేస్తుందని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘భారత్ ఫ్యూచర్​ సిటీలో సింగరేణి కార్పొరేట్ ఆఫీస్​కు 10 ఎకరాలు అలాట్​ చేయాలని మంత్రి శ్రీధర్​బాబును ఆదేశిస్తున్న. నెలకు నాలుగు సార్లు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడికి వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాలి. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే  సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబుకు నా సూచన.. ఇక్కడ 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. అదేవిధంగా, భట్టికి నా సూచన.. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి. దాంతోని గ్లోబల్ సింగరేణి, గ్లోబల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ని మీరు ఇక్కడ నిర్మించండి. క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. సింగరేణి గొప్ప ఆఫీస్. 60 వేల నుంచి -70 వేల మంది కార్మికులకు సంబంధించి, ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ ఇక్కడికి వస్తే... ఇమీడియెట్‌‌‌‌‌‌‌‌గా కట్టాల్సిందే. కట్టడం కోసమే ఇస్తున్నం.. కండిషన్ అదే పెట్టాలి. సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి.  వచ్చే డిసెంబర్ 2026 లోపల ఆఫీస్ పూర్తి చేసి, అందులో ప్రారంభించుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారమే వారికి 10 ఎకరాల భూమి కేటాయించండి. సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం. స్కిల్ యూనివర్సిటీనే కాదు, భవిష్యత్తు కార్యక్రమాలు అన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం. దీని మీదనే మన భవిష్యత్ తరాల ఫ్యూచర్​ ఆధారపడి ఉంది” అని ఆయన పేర్కొన్నారు. 

భూములు కోల్పోయేవాళ్లతో నేనే మాట్లాడి ఆదుకుంట

రాబోయే పదేండ్లలో ఫార్చూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలనేది తమ లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ, గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ పెట్టే విధంగా చేస్తామని తెలిపారు. ‘‘ఫార్చూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి, మీ ఊరికి తీసుకొచ్చి గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలుప్రభుత్వం చేస్తుంది. దీనికి సహకరించండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. కోర్టుకెళ్లి సంవత్సరాల కొద్దీ తిరిగి, అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి, రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే.. ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలియదు. ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తది. అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. కూర్చొని మాట్లాడుకుందాం. 

నేను కూర్చొని మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక మెకానిజం ఎవాల్యూ చేస్త. మల్​రెడ్డి రంగారెడ్డి, కేఎల్‌‌‌‌‌‌‌‌ఆర్ సహకరిస్తున్నరు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులను కూడా సహకరించాలని అడుగుతున్న. భూములు కోల్పోయేవాళ్ల సమస్యలను పరిష్కరిద్దాం” అని తెలిపారు. రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ల ఉచ్చులో పడొద్దని స్థానికులకు సూచించారు. ‘‘మీ కేసులను అన్నిటిని సావధానంగా పరిష్కరించే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు, అదేవిధంగా ఇతర అధికారులకు నేను సూచనలు చేస్తున్న. తక్షణమే వాళ్లను(భూములు కోల్పోయేవాళ్లను) పిలిచి కూర్చోబెట్టి, వాళ్లతో మాట్లాడి, అమికబుల్‌‌‌‌‌‌‌‌గా దీన్ని సెటిల్ చేసి, వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించాలని ఆదేశిస్తున్న. ఇన్​చార్జ్​ మంత్రి శ్రీధర్​బాబు కూడా చొరవ తీసుకుంటరు. మీ(జనం) నష్టం, మీ కష్టం, మీ తాతలు ముత్తాతల ఆస్తి గుంజుకొని నేనేం తీసుకెళ్లను. నేను ఎవరికీ అన్యాయం చేయను. అందరికీ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు నడిపించడం కోసమే నేను ఇక్కడున్న. భూముల విలువ నాకు తెలుసు. జనం కష్టం నాకు తెలుసు. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని(ఫ్యూచర్​ సిటీని) ముందుకు తీసుకువెళ్దాం” అని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ప్రపంచస్థాయి మౌళిక సదుపాయాలు 

ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని పటిష్టం చేస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘ఒక గొప్ప నగరానికి ఏముండాలి? రోడ్డు ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి, పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం, అంతర్జాతీయ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఉండాలి. భారత్ ఫ్యూచర్ సిటీకి ఏమి తక్కువ ఉందని నేను అడుగుతున్నా? శంషాబాద్‌‌‌‌‌‌‌‌లో అంతర్జాతీయ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్  కూతవేటు దూరంలో ఉంది” అని చెప్పారు. ఫ్యూచర్​ సిటీకి  స్థానిక కనెక్టివిటీ మాత్రమే కాకుండా, ఈ సిటీ నుంచి శ్రీశైలం వరకు రోడ్డు వేస్తున్నామని, ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని స్పష్టం చేశారు. 

నగరానికి బెంగళూరును అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాకుండా, బుల్లెట్ ట్రైన్  తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు ఆయన వెల్లడించారు. ‘‘ఏపీ సీఎం తాము అమరావతి కట్టుకుంటాం అని అంటున్నరు. ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ, మచిలీపట్నం పోర్టు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతోనే ఉండేది. పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ అనే బాధను తీర్చడానికి, మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్ట్ వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (12 లైన్స్ రోడ్డు) వేసి కనెక్టివిటీ ఫైనల్ అయింది” అని వివరించారు. ‘‘రేపు పొద్దుగాల మీ ఊరు నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటది, అమరావతికి ఉంటది, అక్కడ నుంచి చెన్నైకి ఉంటది. ఇవన్నీ కూడా మనం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసుకుంటున్నం” అని పేర్కొన్నారు. నగర సౌందర్యం కోసం విద్యుత్ లైన్లను అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ కేబుల్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

నా భూములు ఉంటే రహస్యంగా దాచుకోను కదా!

భారత్​ ఫ్యూచర్​ సిటీ నిర్మాణంలో ఇక్కడి భూములపై కొందరు రాద్ధాంతం చేయడమే కాకుండా ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్​ అయ్యారు.  ‘‘ఇక్కడ రేవంత్ రెడ్డి భూములు ఉన్నాయని, ఆయన కోసం నగరం కట్టుకుంటున్నడని ఆరోపిస్తున్నరు. ఒకవేళ నాకు భూమి ఉంటే తెలవంది కాదు. ఇదేమీ రహస్యంగా దాచి పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్‌‌‌‌‌‌‌‌లో పెట్టుకునే భూమి కాదు. భూమి ఉంటే భూమి మీదనే ఉంటది. భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటది. ఈరోజు నా గురించో, నా సహచర మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతికున్న మనకోసం కాదు. రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ల పిల్లలు, వాళ్ల వాళ్ల పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచన చేస్తున్న” అని వివరించారు. 

ఓఆర్​ఆర్​ నుంచి ట్రిపుల్​ ఆర్​ కనెక్ట్​ అయ్యేలా గ్రీన్​ఫిల్డ్​

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ఓఆర్​ఆర్​ నుంచి రీజినల్​ రింగ్​రోడ్​ (ట్రిపుల్ ఆర్​)ను కనెక్ట్​చేసే మొదటి గ్రీన్​ఫీల్డ్​రేడియల్​ రోడ్​కు సీఎం రేవంత్​ శంకుస్థాపన చేశారు.  ఔటర్​ రింగ్​రోడ్​ ఎగ్జిట్​13 రావిర్యాల నుంచి ఆమనగల్​ వరకూ ఈ రోడ్డును నిర్మించనున్నారు. 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో ట్రిపుల్​ ఆర్​ వరకూ భారీ ఎత్తున అభివృద్ధి జరిగేందుకే ఈ రోడ్డును నిర్మించనున్నట్టు హెచ్​ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 41.50 కి.మీ. మేరకు ఈరోడ్డును నిర్మించనున్నారు. మొదటి దశ రోడ్డును రావిర్యాల్ టాటా ఇంటర్‌‌‌‌‌‌‌‌చేంజ్ (ఓఆర్​ఆర్​) నుంచి మీర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌పేట్ వరకు 19.20 కి.మీ. మేర నిర్మిస్తారు. అలాగే రెండో దశలో మీర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌పేట్ నుంచి ఆమన్​గల్​ (ట్రిపుల్​ఆర్​) వరకు 22.30 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. రోడ్డు పొడవునా ప్రత్యేక మెట్రో/రైల్వే కారిడార్, గ్రీన్‌‌‌‌‌‌‌‌బెల్ట్స్, సైకిల్ ట్రాక్స్, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లు, సర్వీస్ రోడ్లు కూడా నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. రేడియల్​రోడ్​–1 మొత్తం రెండు దశల్లో 14 గ్రామాల గుండా వెళ్లనుంది.  ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటిదశ రూ.1,911 కోట్లు (భూసేకరణ సహా), రెండోదశ 2,710 కోట్లు (భూసేకరణ సహా) ఖర్చు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.4,621 కోట్లుగా అధికారులు తెలిపారు.