V6 News

పన్నులు కట్టి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలా..? వివక్ష వల్లే తెలంగాణ డిమాండ్, నక్సలైట్ ‌‌‌లాంటి సమస్యలు: సీఎం రేవంత్

పన్నులు కట్టి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలా..? వివక్ష వల్లే తెలంగాణ డిమాండ్, నక్సలైట్ ‌‌‌లాంటి సమస్యలు: సీఎం రేవంత్
  • డీలిమిటేషన్లో పర్సంటేజీలు కాదు నంబర్​ముఖ్యం.. 
  • సీట్ల పునర్విభజనపై నాది హైబ్రీడ్ మోడల్
  • పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా, 136 సీట్లు జీఎస్డీపీ ప్రకారం కేటాయించాలి
  • బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు​ అమలుచేయాలి
  • 2026 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్​ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు
  • కానీ ఈ రిజర్వేషన్లను పునర్విభజనతో లింక్‌‌‌‌ పెట్టడం కచ్చితంగా కుట్రే
  • సీట్ల పునర్విభజనపైన  పార్లమెంటులో చర్చించాలి
  • 50 శాతంతో వెళ్తే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు, స్మాల్​స్టేట్స్‌‌‌‌కు తీవ్ర నష్టం​

హైదరాబాద్, వెలుగు:  
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌‌‌‌లో వ్యూహాత్మక కుట్రకు తెరలేపిందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న తమకు తగిన గౌరవం ఇవ్వాల్సింది పోయి, సీట్ల తగ్గింపు ద్వారా శిక్ష వేయడం ఏమిటని ప్రశ్నించారు.  ఇది కేవలం ఒక పార్టీకో, ఒక ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని, 140 కోట్ల మంది దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకాంశమని కేంద్రం గుర్తుంచుకోవాలన్నారు.  సీట్ల పెంపులో  పర్సెంటేజీ ముఖ్యం కాదని సంఖ్య (నంబర్) ముఖ్యమని తెలిపారు. 

‘‘రాజకీయాల్లో సంఖ్యాబలం ఉన్నప్పుడే  మాటకు విలువ ఉంటుంది..  కానీ ఆ నంబర్‌‌‌‌‌‌‌‌నే కుట్రపూరితంగా తగ్గిస్తే మా గొంతు ఎవరూ వినరు’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. సీట్ల పెంపు విషయంలో  ‘హైబ్రిడ్ మోడల్’ను అమలు చేయాలని  ప్రతిపాదించారు.  నియోజకవర్గాలను కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా.. 50శాతం సీట్లను జనాభా ప్రకారం (ప్రోరేటా).. మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రా లు దేశ జీడీపీకి అందిస్తున్న సహకారం (జీఎస్డీపీ)  ప్రాతిపదికన కేటాయించాలని సీఎం అన్నారు. 

ఇలాం టి కీలక అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, వెంటనే  అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు. సీట్ల పెంపు ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని,  అప్పుడే సమగ్రమైన చట్టం తయారవుతుందని సలహా ఇచ్చారు. ఈ అంశంపై త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్‌‌లాంటి చిన్న రాష్ట్రాలకు లేఖ రాస్తానని తెలిపారు.  

  • మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నం..

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ కట్టుబడి ఉన్నదని సీఎం రేవంత్‌‌ చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మహిళలకు పురుషులతో సమానంగాఓటు హక్కు కల్పించిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు.  140 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మహిళలను ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చిందని, అందుకే అత్యున్నత పదవుల్లో వారిని నియమించిందని తెలిపారు. ‘‘స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన రాజీవ్ గాంధీ మహిళా సాధికారతకు బాటలు వేశారు. తర్వాత సోనియా గాంధీ హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేశారు. 

కానీ నారీశక్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే భారతీయ జనతా పార్టీకి ఆచరణలో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 1980 ఏప్రిల్ 6న పుట్టిన బీజేపీకి ఇప్పటివరకు సుమారు 15 మంది జాతీయ అధ్యక్షులు మారారు. కానీ ఒక్క మహిళనైనా ఆ పదవిలో నియమించారా?’’ అని  ప్రశ్నించారు. నితిన్ గడ్కరీ నుంచి జగత్ ప్రకాశ్‌‌ నడ్డా వరకు అంతా పురుషులే అధ్యక్షులుగా ఉన్నారని, మహిళలకు పార్టీలో అత్యున్నత స్థానం ఇవ్వని వారు దేశం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 

బీజేపీలో కనీసం జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)లాంటి కీలకమైన పదవిని కూడా ఇప్పటివరకూ ఏ మహిళకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందిరా గాంధీలాంటి ధైర్యవంతురాలైన నాయకురాలిని, సోనియాగాంధీలాంటి సమర్థురాలైన అధ్యక్షురాలిని అందించిన తమ పార్టీని చూసి బీజేపీ నేతలు నేర్చుకోవాలన్నారు. కేవలం ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేస్తున్న ఈ డ్రామాను ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తిచేశారు.

మహిళా రిజర్వేషన్ల అమలుపై కాలయాపన వద్దు

మహిళా రిజర్వేషన్లను 2026 తర్వాత జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను సీఎం రేవంత్‌‌రెడ్డి తప్పుపట్టారు.  ‘‘రిజర్వేషన్లు ఇవ్వడానికి అప్పుడు ఇప్పుడు ఎందుకు, చిత్తశుద్ధిఉంటే ఇప్పుడే అమలు చేయాలి.  ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని, 33 శాతం కోటా ప్రకారం 181 సీట్లను తక్షణమే మహిళలకు కేటాయించేలా చట్ట సవరణ చేయాలి’’ అని డిమాండ్​చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, దీనిపై ఎలాంటి చర్చా అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 

‘‘2024 లోక్ స‌‌భ ఎన్నిక‌‌ల్లోనే 33 శాతం రిజ‌‌ర్వేష‌‌న్ క‌‌ల్పిస్తే  181 చోట్ల మహిళ‌‌లు ఎంపీలయ్యే అవ‌‌కాశం ఉండేది. కానీ పెండింగ్​ పెట్టడం వల్ల మ‌‌హిళ‌‌లు రిజ‌‌ర్వేష‌‌న్లకు దూరమయ్యారు. 2026 జ‌‌నాభా లెక్కలయ్యాక అమలుచేయకుండా 2011 లెక్కల ప్రకారం చేస్తామనడం ముమ్మాటికీ కుట్రే. 2026 జ‌‌నాభా లెక్కల ప్రకారం నిబంధ‌‌న‌‌ను స‌‌వ‌‌రిస్తే 2029 లోక్ స‌‌భ‌‌తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో మ‌‌హిళా రిజ‌‌ర్వేష‌‌న్లు అమ‌‌లు చేయొచ్చు’’ అని సీఎం సలహాఇచ్చారు. 

తెలంగాణ  కూడా మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు.  ఒకవేళ కేంద్రం తక్షణమే మహిళా కోటాను అమలు చేయాలని నిర్ణయిస్తే, తెలంగాణ అసెంబ్లీలోని 119 సీట్లలో 40 స్థానాలను మహిళలకు కేటాయించడానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని, మహిళా కోటాపై కాంగ్రెస్‌‌కున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని పేర్కొన్నారు. 

  • నియోజకవర్గాల మధ్య భారీ వ్యత్యాసాలు 

‘‘మల్కాజ్‌‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలో దాదా పు 36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ, గోవా లాంటి రాష్ట్రంలో కేవలం 12 లక్షల మంది ఓటర్లకే రెం డు ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే 3 మల్కాజ్‌‌గిరి నియోజకవర్గాలు కలిస్తే ఒక గోవా రాష్ట్ర జనాభాతో సమానం”అని సీఎం వెల్లడించారు. ఇలాంటి భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు జనాభా ఒక్కటే సీట్ల పెంపునకు ప్రాతిపదిక ఎలా అవుతుందని? ఆయన ప్రశ్నించారు. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికే విరుద్ధమని, ఓటు విలువలో అసమానతలు కలిగిస్తుందని తెలిపారు.    ఈ అసమానతలను తొలగించకుండా సీట్లు పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.  

  • పన్నులు మావి.. నిర్ణయాలు మీవా?

మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు  కేరళ రాష్ట్రాలు కలిపి దేశ జీడీపీకి దాదాపు 53 శాతం వాటా అందిస్తున్నాయని సీఎం రేవంత్‌‌ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శక్తిని వాడుకుంటున్న కేంద్రం, తమకు ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడం లేదన్నారు.  ‘‘పన్నులు కట్టేది మేం, పెత్తనం చేసేది ఉత్తరాది రాష్ట్రాలా ?’’ అని  ప్రశ్నించారు.  

తెలంగాణ జనాభా దేశ జనాభాలో కేవలం 2.5 శాతమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీకి 5 శాతం వాటాను అందిస్తోందని ఆయన  గుర్తుచేశారు. దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాలను రాజకీయం గా అణగదొక్కడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పారు. ‘‘దక్షిణాది రాష్ట్రాలు ఒక రూపాయి పన్ను కడితే కేంద్రం తిరిగి ఇస్తున్నది కేవలం 16 నుం చి 40 పైసలే. అదే బిహార్ రూపాయి పన్ను కడితే వారికి 6 రూపాయలు ఇస్తున్నారు.. యూపీకి మూడున్న ర రూపాయలు ఇస్తున్నారు. 

మా దగ్గర వసూలు చేసిన పన్నుల ఆదాయాన్ని అక్కడ ఖర్చు పెట్టడం ఎంతవర కు సమంజసం”అని రేవంత్‌‌  ప్రశ్నించారు.  ‘‘పన్నులు మేం కట్టాలి కానీ నిర్ణయాలు మాత్రం మీరు తీసుకుంటారా?’’ అంటూ నిలదీశారు.  పీఎం, హోం శాఖ, రక్ష ణ శాఖలాంటి కీలకమైన మొదటి పది శాఖల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారికి అసలు ప్రాధాన్యతే లేదని సీఎం విమర్శించారు. కేవలం ఆర్థిక శాఖను మాత్రమే ఒక దక్షిణాది మహిళకు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 

కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో దక్షిణాది నేతల అభిప్రాయాలకు విలువ ఉండటం లేదన్నారు. ఇది రాజకీయంగా దక్షిణాదిని బలహీనపరిచే కుట్రలో భాగమేనన్నారు. సమాఖ్య వ్యవస్థలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని, కానీ బీజేపీ మాత్రం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. కేంద్రం తన వైఖరిని మార్చుకుని అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

  • హైబ్రిడ్ మోడల్ అమలు చేయాలి.. 

 సీట్ల పెంపు విషయంలో  ‘హైబ్రిడ్ మోడల్’ను అమలు చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. నియోజకవర్గాలను కేవలం జనాభా ప్రాతిపదికన పెంచకుండా, 50 శాతం సీట్లను జనాభా ప్రకారం (ప్రోరేటా)..  మిగిలి న 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాలు దేశ జీడీపీకి అందిస్తున్న సహకారం (జీఎస్డీపీ ) ప్రాతిపదికన కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి పాటుపడ్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించడానికి ఇదే సరైన మార్గమని తెలిపారు. ఈ హైబ్రిడ్ మోడల్ వల్ల అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రాల మధ్య పోటీ తత్వం కూడా పెరుగుతుందని తెలిపారు. కేంద్రం ఈ ప్రతిపాదనను సీరియస్ గా తీసుకొని మేధావులతో చర్చలు జరపాలని ఆయన కోరారు.

  • శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల కమిటీ వేయాలి..

సీట్ల పెంపు ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించడానికి కేంద్రం నిపుణుల కమిటీని వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి భౌగోళిక, ఆర్థిక సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఆ నివేదికను పార్లమెంటుతోపాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ చర్చించి, అందులోని లోపా లను సవరించిన తర్వాతే పునర్విభజనపై ముందడుగు వేయాలి. దేశ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాన్నిఅత్యంత జాగ్రత్తగా డీల్ చేయాలి. 2027 మార్చి నాటికి జనాభా లెక్కలు పూర్తవుతాయని కేంద్రమే చెప్పినప్పుడు, డీలిమిటేషన్​ కోసం అప్పటి వరకు వేచి చూడాలి. 

2028లో అందరి అంగీకారంతో, పూర్తిస్థాయి చర్చల నడుమ ఈ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.  కేంద్రం మాట వినకపోతే  నాడు తెలంగాణ కోసం పార్లమెంటులో ఏ విధంగా కొట్లాడారో మరోసారి కాంగ్రెస్​ ఎంపీలు అలాంటి పోరాటమే చేస్తారని సీఎం హెచ్చరించారు.  ‘‘నాడు తెలంగాణ సాధన కోసం కేశవరావు, వివేక్, రాజగోపాల్‌‌రెడ్డి, జితేందర్‌‌‌‌ రెడ్డిలాంటి నేతలు లోక్‌‌సభలో వీరోచితంగా పోరాడారు. చివరికి మన ‘పెప్పర్ స్ప్రే స్టార్’ పొన్నం ప్రభాకర్  కూడా తన సత్తా చూపించి తెలంగాణను సాధించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు   రాష్ట్ర హక్కుల కోసం మల్లు రవిలాంటి ఎంపీలు గొంతుక వినిపిస్తారు’’ అని రేవంత్ పేర్కొన్నారు.

 

  • 50శాతం సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య అగాధం

50 శాతం సీట్ల పెంపుతో పర్సంటేజీల్లో తేడా ఉండదని, సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేరళలో 20 సీట్లు, యూపీలో 80 సీట్లు ఉన్నాయని, 50 శాతం పెంచితే కేరళకు 30 సీట్లు వస్తాయని,  యూపీకి 120 సీట్లు వస్తాయన్నారు.  అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్తా, సీట్ల పెంపు తర్వాత 90 సీట్లకు పెరుగుతుందని వివరించారు. 

ఈ అగాధం దక్షిణాది రాష్ట్రాల ఉనికిని దెబ్బతీస్తుందని చెప్పారు.  ఇద్దరిలో ఒకరి దగ్గర వంద రూపాయలు,  పక్కింటాయన దగ్గర  వంద కోట్లు ఉన్నాయనుకుంటే  కేంద్ర  ప్రభుత్వం వచ్చి ఇద్దరికీ వంద శాతం పెంచుతున్నాం అని చెబితే,  వంద రూపాయలు రెండు వందలు అవుతాయని,  కానీ వంద కోట్లు ఉన్నాయన దగ్గర అది  రెండు వందల కోట్లు అవుతుందని అన్నారు. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ 200 కోట్ల రూపాయలకు పెరుగుతుందని వివరించారు. 

  • రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తు తాకట్టు

జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు అదనపు సీట్లు ఇవ్వడం అంటే దేశాభివృద్ధిని  అడ్డుకోవడమేనని సీఎం రేవంత్‌‌ రెడ్డి అన్నారు. ‘‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల వల్ల అక్కడ విద్య, వైద్య సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ కేంద్రం వారికి రాజకీయంగా ప్రాధాన్యత పెంచుతోంది. క్రమశిక్షణతో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతే, దేశం మొత్తం జనాభా విస్ఫోటనం వైపు వెళ్లే ప్రమాదం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దు. మంచి పని చేసిన వారిని మెచ్చుకోక పోగా, వారిని అణచివేసే ప్రయత్నం చేయడం సరికాదు. 

గతంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని గుర్తించిన వాజ్​పేయి.. 2001లో సీట్ల పెంపును 25 ఏండ్లపాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే 2026 వరకు సీట్ల సంఖ్యను మార్చకూడదని ఆనాడు చట్టం చేశారు. ఆనాటి దూరదృష్టి నేటి బీజేపీ నాయకులకు ఎందుకు లేదు’అని ఆయన ప్రశ్నించారు. నేటి పాలకులు సైతం రాజకీయ పంతాలకు పోకుండా, ఆనాటి మహనీయులు చూపిన బాటలో నడవాలని సూచించారు. 

  • లక్ష్మణ్​ యూపీ నుంచి ఎంపీ.. దక్షిణాది అవసరాలు పట్టవు

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారని, అందుకే ఆయనకు తెలంగాణ ప్రయోజనాల కంటే యూపీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని సీఎం రేవంత్‌‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘అక్కడ సీట్లు పెరిగితే ఆయనకు రాజకీయంగా లాభం జరుగుతుంది. అందుకే దక్షిణాదికి జరుగు తున్న అన్యాయంపై ఆయన మౌనంగా ఉన్నారు. సొంత గడ్డను వదిలి పరాయి రాష్ట్రం కోసం పాకులాడే నాయకులు దక్షిణా ది హక్కులను ఎలా కాపాడతారు’అని ఆయన ప్రశ్నించారు. 

కేంద్రమంత్రి బండి సంజయ్‌‌కి మహిళల పట్ల ఏ మాత్రం గౌర వం ఉందో ఆయన మాటలే నిరూపిస్తున్నా యని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల గురించి మాట్లాడే సంజయ్, ముందు తమ పార్టీలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలని సూచించారు. బీజేపీకి మహిళను అధ్యక్షు రాలిగా నియమించాకే బండి సంజయ్‌‌ మాట్లాడాలి’ అని చురకలంటించారు.

  • హడావుడి ఆమోదం వెనుక భారీ కుట్ర

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీల్లో హడావుడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి.. బిల్లులు ఆమోదింపజేయాలనుకోవడం వెనుక  భారీ కుట్ర  దాగి ఉందని రేవంత్‌‌ రెడ్డి ఆరోపించారు. ‘మహిళా రిజర్వేషన్ల అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ప్రతిపక్షాలు సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు అనేవి పూర్తిగా రెండు భిన్నమైన అంశాలు. వీటిని కలిపి చూపడం రాజకీయ కుతంత్రమే. ఈ రెండింటినీ విడదీసి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. హడావుడి వల్ల జరిగే శాశ్వత నష్టాన్ని ప్రజలు గమనించాలి. కేంద్రం తన మొండి వైఖరిని వీడాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడానికే కేంద్రం ఈ కుట్ర పన్నుతోంది’అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

రాజకీయాల్లో నంబర్ గేమ్ ఉన్నప్పుడే తమ మాటలకు విలువ ఉంటుందని, కానీ ఆ నంబర్​నే తగ్గిస్తే తమ గొంతు ఎవరూ వినరని అన్నారు. ‘‘పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి.. ఇదేనా మీరు కోరుకుంటున్నది? ఈ రకమైన వివక్ష కొనసాగితే దక్షిణాది ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది.  తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌‌ ఉద్యమం ఎందుకు వచ్చాయో గుర్తు చేసుకోవాలి. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉంది’అని ఆయన పిలుపునిచ్చారు.