- కేసీఆర్ ముందు కవితకు సమాధానం చెప్పాలి..
- ‘మర మనిషి’ వ్యాఖ్యలపై మాట్లాడాలి
- బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టువేసి చెప్పాలి
- తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మా ఎంపీలు మాట్లాడింది వీళ్లకు కనిపించలేదా?
- రాష్ట్రంలో ఇక రెండే కూటములు
- ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం కూటమి.. రెండోది బీఆర్‌ఎస్, బీజేపీ కూటమి
- కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే
- సీబీఐ విచారణ జరిపించాలి
- లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తం
- మహిళా బిల్లు, డీ లిమిటేషన్, జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీవి శిఖండి రాజకీయాలని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ సచ్చిన శవంతో సమానమని, ఎంత అలంకారం చేసినా ఆ శవం లేచిరాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కవిత కొత్త పార్టీ సంగతి ఏమోగానీ, ఉన్న పార్టీ కూడా ఉంటుందో..ఊడుతుందో ముందు చూసుకోవాలని కామెంట్ చేశారు. బీఆర్ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవిత ప్రశ్నలకు మొదట జవాబు చెప్పాలన్నారు. సోమవారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
‘‘కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి అని కవిత అన్నారు. ఆ మాటలపై కేసీఆర్ సమాధానం ఇవ్వాలి.. భవిష్యత్తులో బీజేపీతో కలవబోనని తాను నమ్మిన దేవుడిపై ఒట్టువేసి చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. లోక్‌సభలో తేజస్వి సూర్య తెలంగాణను అవమానిస్తే వెధవలెవరూ స్పందించలేదన్న కేసీఆర్‌కు రేవంత్ గట్టి కౌంటర్ఇచ్చారు. ‘‘వెధవలకు అందరూ వెధవల్లానే కనిపిస్తారు.. పార్లమెంట్‌లో మా ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలంటూ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు.. ఈ వెధవలు చూడలేదా?.. వినలేదా?’’ అంటూ ఫైర్ అయ్యారు.
హైడ్రాతో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెరలోంచి విడిపించి, స్వాధీనం చేసుకున్నామని, ఇలాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ తప్పుపట్టడం వింతగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రెండే కూటములు ఉంటాయని, ఇందులో ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం కూటమి అని, రెండోది బీజేపీ, బీఆర్‌ఎస్ కూటమి అని సీఎం అన్నారు.
కేసీఆర్ తనకు శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి.. అలాంటి వ్యక్తిపై నేను విమర్శలు కూడా చేయను. ఆయనకు ఏదో కావాలని నేనెందుకు కోరుకుంటాను? ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాను.
అసెంబ్లీకి వస్తే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. ఆయనకు ఏమైనా జరిగితే ఆ పార్టీ ఆస్తులు, చివరకు ఫాంహౌజ్ నాకు రావు. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అవి దక్కుతాయి. అందుకే ఆయనకు ఏదైనా కావాలని వాళ్ల కుటుంబ సభ్యులే కోరుకుంటారు.. తప్ప ఇతరులు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
వారసత్వం కోసం ఔరంగజేబు తన కుటుంబంలోని అందరినీ చంపేశాడని, నేపాల్ రాజు కుటుంబంలో కూడా ఇలానే జరిగిందని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కూడా జరుగుతున్న పంచాయితీ అలాంటిదేనని పేర్కొన్నారు. కవిత పార్టీ పెట్టింది..ఆస్తుల పంచాయితీ కోసమేనన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు..
తెలంగాణ రావాలన్న కోరికతో 2001 నుంచి 2014 వరకు ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించారని, తెలంగాణ తెచ్చారన్న కారణంగా 2014 నుంచి 2023 వరకు అండగా నిలిచారని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంత అహంకారాన్ని ప్రదర్శించినా.. అవినీతికి పాల్పడినా.. నియంతలా వ్యవహరించినా.. జనం భరించారని తెలిపారు. ఆ తర్వాత తమను ఆదరించారన్నారు. కేసీఆర్‌కు వరుస ఓటములు .. తనకు వరుస గెలుపులు కొత్త కాదని, రాబోయే రోజుల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించామని, 2024 లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చామని, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పలేదన్నారు. కేసీఆర్ కుటుంబంతో, బీఆర్‌ఎస్ తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. వారి తాపత్రయమంతా కుటుంబం కోసమేనని, ఆ పంచాయితీల్లో వచ్చిన కొత్త పార్టీలను తమపై రుద్దవద్దని పేర్కొన్నారు. ఒకే చెరువు నుంచి వచ్చిన నీటి రంగు, రుచి, వాసన మారవని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదని అభిప్రాయపడ్డారు.
బండి సంజయ్‌కి అవగాహన లేదు
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణ పనుల కోసం అన్ని ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.‘‘ఇటీవల కాళేశ్వరం విజిట్‌కు వెళ్లినప్పుడు మాతోపాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ పాల్గొన్నారు. దీనిని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పు పడ్తూ ఆయన్ను సస్పెండ్‌చేయాలని డిమాండ్చేస్తున్నారు.
అధికారుల విధుల పట్ల ఆయనకు కనీసం అవగాహన ఉందా? మరి రాష్ట్రంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటున్న కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటే మేం సస్పెండ్ చేయాలా?’’ అని సీఎం నిలదీశారు. ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వద్దని బీజేపీ వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకే హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారని, అయితే దీన్ని తప్పుదోవ పట్టించడానికే బండి సంజయ్ ఎన్డీఎస్‌ఏ చైర్మన్ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఘోష్ నివేదికను కోర్టు తప్పుపట్టలేదు..
కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీశ్ కోర్టును ఏమి అడిగారో ముందు తెలుసుకోవాలని మీడియా ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. ‘‘ఘోష్ నివేదికను కొట్టివేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. కోర్టు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కమిషన్ రిపోర్టు ఆధారంగా వారిపై చర్యలు తీసుకోరాదని మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చింది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదన్న అంశాన్ని మాత్రమే తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు ఉన్నాయని కేసీఆర్ హయాంలోనే ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ ఉద్దేశాలు అంటగట్టవద్దనే జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించాం. ఈ నియామకాన్ని కోర్టు సైతం సమర్థించింది’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీవి శిఖండి రాజకీయాలు..
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్, జమిలీ ఎన్నికలులాంటి అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, బీజేపీ శిఖండి రాజకీయాలే ఇందుకు కారణమని సీఎం రేవంత్ ఫైర్అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చాయని, కానీ డీ లిమిటేషన్‌తో లింక్ పెట్టినందునే ఈ బిల్లు వీగిపోయిందన్నారు.
మెజారిటీ లేకున్నా ఏకపక్షంగా బిల్లు పెట్టి, వీగిపోగానే ప్రతిపక్షాలను విమర్శించడం ఏం పద్ధతి? అని నిలదీశారు. మోదీ చెప్పినట్టు చేసేందుకు తాము సహచరులం, అనుచరులం కాదన్నారు. 50 శాతం సీట్లు పెంపు అనేది తమకు ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పారు.‘‘50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడు? రాముడేమైనా చెప్పాడా? రాముడే బీజేపీకి అనుకూలంగా లేడు. అందుకే రాముడి గుడి కట్టిన ఆయోధ్యలో బీజేపీ ఓడిపోయి, అక్కడ దళితుడు గెలిచాడు’’ అని రేవంత్ చురకలంటించారు.
కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు స్పందిస్తలేదు
కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ జరపకుంటే ఉద్యమం తప్పదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎన్‌డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరాం.. అప్పట్లో కాళేశ్వరం బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని పీఎం సహా కేంద్రమంత్రులంతా ఆరోపించారు. కానీ మేం సీబీఐ విచారణ కోరితే కేంద్రం స్పందించడం లేదు.
ఈ కేసును సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ జరిపిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చప్పుడు చేస్తలేడు. బీఆర్ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే ప్రభుత్వం తరఫున తాను, పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీనిపై తాను, మంత్రి ఉత్తమ్ కలిసి త్వరలోనే సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ కోరుతామని చెప్పారు.

