అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. కారు దిగగానే ఎమోషనల్ హగ్.. నెట్టింట విజువల్స్ వైరల్!

అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. కారు దిగగానే ఎమోషనల్ హగ్.. నెట్టింట విజువల్స్ వైరల్!

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మాతృమూర్తి మోహిని మణి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసున్న ఆమె.. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, జ్ఞాపకశక్తి లేకపోవడంతో బాధపడుతూ ఇంట్లోనే కన్నుమూశారు. ఈ హృదయవిదారక వార్త వినగానే దుబాయ్‌లో షూటింగ్‌లో ఉన్న అజిత్ హుటాహుటిన చెన్నైకి చేరుకున్నారు.

అజిత్ ఇంటికి దళపతి

అయితే, ఈ శోకసంద్రంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఒక స్పెషల్ గెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయనే తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్ (CM Vijay). అజిత్, విజయ్ మధ్య బాక్సాఫీస్ వద్ద ఎంతటి భీకరమైన పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ, ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య ఎంతటి క్రేజీ ఫ్రెండ్‌షిప్ ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ నెలలోనే సీఎం అయిన విజయ్‌కు అజిత్ శుభాకాంక్షలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ స్వయంగా అజిత్ ఇంటికి వెళ్లి ఓదార్చారు.

ఎమోషనల్ హగ్.. 

భారీ సెక్యూరిటీ నడుమ అజిత్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్.. కారు దిగీ దిగగానే అజిత్‌ను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చారు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకరినొకరు హగ్ చేసుకున్న ఈ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్‌తో పాటు సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha) కూడా బ్లాక్ సల్వార్ సూట్‌లో వచ్చి నివాళులర్పించారు. అజిత్‌తో కలిసి రీసెంట్‌గా 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాల్లో నటించిన త్రిష.. ఈ దుఃఖసమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతకుముందు విజయ్ ఎక్స్ వేదికగా కూడా సంతాపం ప్రకటించారు. నా ప్రియ మిత్రుడు అజిత్ తల్లి మోహిని అమ్మాయార్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. జీవితంలోని ప్రతి దశలోనూ కొడుకుకు అండగా నిలిచిన తల్లిని కోల్పోవడం సృష్టించిన శూన్యాన్ని భరించాలంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మోహిని మణి అంత్యక్రియలు ఆదివారం (మే 31న) జరగనున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు అజిత్ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.