ఓబీసీ కోటా తేల్చినంకనే.. యూపీ మున్సిపల్ ఎన్నికలు 

ఓబీసీ కోటా తేల్చినంకనే.. యూపీ మున్సిపల్ ఎన్నికలు 

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓబీసీ కోటాను తేల్చినంకనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు లేకుండనే అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఆదేశించడంపై సీఎం ఈ వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ విధానం మాదిరిగా సర్వే నిర్వహించిన తర్వాతే ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామని చెప్పారు.

అవసరమైతే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని, సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం కమిషన్ ద్వారా సర్వే చేయించి మళ్లీ రిజర్వేషన్లను నిర్ణయిస్తామన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళతామన్నారు. యూపీ ప్రభుత్వం డిసెంబర్ 5నాటి నోటిఫికేషన్ లో పేర్కొన్న ఓబీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా ప్రకారం లేవని మంగళవారం జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ సౌరవ్ లవానియాతో కూడిన లక్నో బెంచ్ తప్పుపట్టింది.

ఓబీసీ రిజర్వేషన్లను ఫిక్స్ చేసే ముందు ప్రభుత్వం ఒక కమిషన్ ను నియమించి స్టడీ చేయాల్సి ఉన్నా.. అలా చేయనందున నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిల్స్​ను విచారించిన బెంచ్ ఈ మేరకు నోటిఫికేషన్​ను రద్దుచేస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై సమాజ్ వాదీ పార్టీ స్పందిస్తూ.. ఇది బీసీలను అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్ర అని ఆరోపించింది. 

నోటిఫికేషన్ లో ఏముంది? 

యూపీ ప్రభుత్వం డిసెంబర్ 5న ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 200 మున్సిపల్ కౌన్సిళ్లకు చైర్ పర్సన్లు, 545 నగర పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలను వెల్లడించింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయాలని పేర్కొంది. అలీగఢ్, మధుర వృందావన్, మీరట్, ప్రయాగ్ రాజ్ మేయర్ సీట్లను ఓబీసీలకు కేటాయించినట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. వీటిలో అలీగఢ్, మధుర మేయర్ సీట్లను ఓబీసీ మహిళలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే 54 మున్సిపల్ కౌన్సిళ్ల చైర్ పర్సన్ సీట్లను ఓబీసీలకు కేటాయించారు. ఇందులో 18 సీట్లను ఓబీసీ మహిళలకు ఖరారు చేశారు. నగర పంచాయతీల్లో 147 సీట్లను ఓబీసీలకు, అందులో 49 సీట్లను ఓబీసీ మహిళలకు కేటాయించారు.