V6 News

నాన్ దోస్త్ కాలేజీలపై సర్కారు సీరియస్

నాన్ దోస్త్ కాలేజీలపై సర్కారు సీరియస్
  • నివేదిక ఇవ్వాలని టీజీసీహెచ్ఈకి సీఎంవో ఆదేశం 
  • వెంటనే ఫీజుల దందా, కోర్టు కేసులపై రిపోర్ట్ ఇచ్చిన బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నాన్ దోస్త్ కాలేజీల దందాపై ప్రభుత్వం సీరియస్ అయింది. కొన్ని కాలేజీలు దోస్త్  పరిధిలోకి రాకుండా సొంతంగా అడ్మిషన్లు చేసుకుంటూ, విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆయా కాలేజీల తీరుపై ‘వెలుగు’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘నో దోస్త్.. ఫీజులు మస్త్’ కథనంపై సర్కారు స్పందించింది.  నాన్ దోస్త్ కాలేజీల వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.  

సీఎంఓ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి గురువారమే సర్కారుకు ప్రాథమిక నివేదికను అందజేశారు. రాష్ట్రంలో అసలు నాన్ దోస్త్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? అవి ఎన్ని ఏండ్ల నుంచి దోస్త్ పరిధిలోకి రాకుండా అడ్మిషన్లు సాగిస్తున్నాయి? విద్యార్థుల నుంచి ఏ మేరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి? అనే వివరాలను నివేదికలో పొందుపరిచారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ఫీజుల దందా వెనుక ఉన్న అక్రమాలను నివేదికలో వివరించినట్లు తెలిసింది.

దోస్త్ పరిధిలోకి రాకుండా ఉండేందుకు కొన్ని కాలేజీలు ఆశ్రయించిన న్యాయపరమైన అంశాలను కూడా కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఉన్న కేసుల పరిస్థితిని, కాలేజీల వాదనలను నివేదికలో వివరించారు. మరోపక్క విద్యాశాఖ సెక్రటరీకి కూడా నాన్ దోస్త్ కాలేజీలపై బాలకిష్టారెడ్డి తన నివేదికను అందించినట్టు తెలిసింది.