గతం మరిచిపోదాం.. కలిసి నడుద్దాం
కేసీఆర్ – జగన్ ఉమ్మడి ప్రకటన
హైదరాబాద్ : అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పారు.
నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మరిచిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు.
కృష్ణా పరీవాహకంలో సాగునీటి కష్టాల దూరం చేస్తాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతిజ్ఞ చేశారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
భేటీ నేపథ్యం ఇదీ..
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్నతర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది.
2 తెలుగు రాష్ట్రాల్లో గుణాత్మక మార్పు వచ్చింది : KCR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్ లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు… ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. AP ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
తక్కువ ఖర్చుతో తెలుగు రాష్ట్రాలకు నీళ్లు అందిస్తాం : జగన్
‘‘తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

