- కొత్త లేబర్ కోడ్ నేపథ్యంలో కీలక చర్చ
- కేంద్ర అనుమతి వస్తే కమిటీ ఏర్పాటు ప్రక్రియ
- 12న తలపెట్టిన కార్మిక సంఘాల సదస్సుకు బ్రేక్
కోల్‌బెల్ట్, వెలుగు: దేశ బొగ్గు పరిశ్రమలో కార్మికుల 12వ వేతన జేబీసీసీఐ ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. గురువారం కోల్‌కతాలోని కోల్‌ఇండియా భవనంలో జరిగిన అపెక్స్ జేసీసీ సమావేశంలో 12వ జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ ద కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. కొత్త లేబర్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కమిటీ ఏర్పాటుపై కార్మిక సంఘాలు చాలాకాలంగా ఒత్తిడి తెస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జేబీసీసీఐ ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని కోల్‌ఇండియా యాజమాన్యం హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌లోని సెక్షన్ 14 నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా జేబీసీసీఐని ఏర్పాటు చేయవచ్చని బీఎంఎస్ ప్రతినిధి కొత్తకాపు లక్ష్మారెడ్డి సూచించారు.
కోల్‌ఇండియా యాజమాన్యం లేఖ పంపేందుకు అంగీకరించడంతో సెప్టెంబర్ 12న రాంచీలో నిర్వహించ తలపెట్టిన జాయింట్ కార్మిక సంఘాల సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ లేఖకు ఆమోదం తెలిపితే 12వ జేబీసీసీఐ ఏర్పాటు ప్రక్రియకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.
ఐఎన్‌టీయూసీకి చోటివ్వాలి..
జేబీసీసీఐ, కార్మిక చట్టాల ప్రక్రియలో ఐఎన్‌టీయూసీని చేర్చాలని ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఐఎన్‌టీయూసీకి సంబంధించిన కోర్టు కేసులు, పెండింగ్ అంశాలను సమీక్షించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని కోల్‌ఇండియా యాజమాన్యం తెలిపింది.
పారిశ్రామిక సంబంధాల కోడ్–2020 నిబంధనలు, కోల్‌ఇండియాలో వాటి అమలు అవకాశాలపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో కోల్‌ఇండియా చైర్మన్ బి.సాయిరాం, డైరెక్టర్ ముఖేశ్ చౌదరి, కార్మిక సంఘాల తరఫున కె.లక్ష్మారెడ్డి (బీఎంఎస్), హర్భజన్ సింగ్ సిధు (హెచ్ఎంఎస్), రామేంద్ర కుమార్(ఏఐటీయూసీ), డి.డి.రామానందన్(సీఐటీయూ) పాల్గొన్నారు.
