బొగ్గు గనుల్లో పర్యటించిన టూరిస్టులు

బొగ్గు గనుల్లో పర్యటించిన టూరిస్టులు

గోదావరిఖని, వెలుగు: దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణి ‒ టీఎస్‌‌ఆర్టీసీ సంయుక్తంగా ‘కోల్ టూరిజం’ ను ప్రారంభించాయి. ఇందుకోసం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మూసివేసిన లైఫ్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ ప్రాజెక్ట్‌ అండర్‌ గ్రౌండ్‌‌ మైన్‌‌ను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దారు. ఆర్టీసీ ఈ గని పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. బుధవారం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చిన 20 మంది గనిని సందర్శించారు. వీరికి ఆర్టీసీ, సింగరేణి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మైన్‌‌ వద్ద సింగరేణి డైరెక్టర్ ఎస్‌‌.చంద్రశేఖర్ టూరిజం శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యాన్‌‌ రైడింగ్‌‌ చైర్‌‌ కార్స్‌‌ ద్వారా పర్యాటకులను బొగ్గు గని లోపలికి తీసుకెళ్లి, బొగ్గు ఉత్పత్తి ఎలా జరుగుతుందో ఎస్‌‌ఓటు జీఎం సలీం వివరించారు. గని, ఓసీపీలలో వాడే యంత్రాల నమూనాలను ప్రదర్శించారు.

అలాగే ఓసీపీ–3 వ్యూ పాయింట్‌‌ నుంచి బొగ్గు కోసం బ్లాస్టింగ్‌‌ చేసే విధానాన్ని, యైటింక్లయిన్‌‌ కాలనీలో మైన్స్‌‌ రెస్య్కూ స్టేషన్‌‌లో చేపడుతున్న సేఫ్టీ మెజర్స్‌‌ను ప్రాక్టికల్‌‌గా చూపించారు. బొగ్గు వెలికితీతలో చేపట్టే రక్షణ చర్యలు, బొగ్గు ఉత్పత్తి విషయాలపై అవగాహన కల్పించారు. సింగరేణి డైరెక్టర్‌‌ చంద్రశేఖర్‌‌ మాట్లాడుతూ.. సింగరేణి దర్శన్‌‌ పేరుతో ప్రతి శనివారం హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ ప్యాకేజీ ద్వారా యాత్ర సాగుతుందన్నారు. భూగర్భంలో బొగ్గు ఎలా తీస్తారు? విద్యుత్‌‌ ఉత్పత్తి ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.