మా డిమాండ్లు నెరవేర్చకుంటే.. మళ్లీ నిరసన చేపడ్తం సీజేపీ వార్నింగ్

మా డిమాండ్లు నెరవేర్చకుంటే..  మళ్లీ నిరసన చేపడ్తం సీజేపీ వార్నింగ్
  • విద్యాశాఖ మంత్రి రిజైన్​ తప్ప.. అన్ని సమస్యలూ పెండింగ్​లోనే..
  • ప్రధాన్​ ప్లేస్​లో ప్రహ్లాద్​ జోషి నియామకం పైనా అసంతృప్తి 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పూర్తిస్థాయిలో నెరవేర్చకుంటే మళ్లీ నిరసన చేపడ్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి రిజైన్​తో తమ కీలక డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాటిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. 

సోమవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. చర్చల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీజేపీ ఊరుకోదని దీప్కే అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి లేకపోతే మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. చర్చల సమయంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌‌చుక్ తక్షణ విడుదల.. దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ల ఉపసంహరణ తదితర డిమాండ్లను కేంద్రం ముందు సీజేపీ ఉంచింది.

 అయితే, అందులో విద్యాశాఖ మంత్రి రాజీనామా మాత్రమే పరిష్కారమైందని.. మిగిలినవి ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకంపైనా దీప్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలోనూ దీప్కే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.‘ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ, పరిహారం ఇచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రం నిబంధనలను పరిశీలించాలంటారు. దీన్ని బట్టి వారి ఉద్దేశం సరిగ్గా లేదని అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్, నేపాల్ వైపు చూడనక్కర్లేదు..

ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహాత్మా గాంధీ వారసత్వం భారతదేశానికి ఉండగా.. విద్యార్థి నిరసనకారులు బంగ్లాదేశ్ లేదా నేపాల్ వైపు చూడాల్సిన అవసరం లేదని అభిజీత్ దీప్కే అన్నారు.  సోమవారం ఛత్రపతి సంభాజీనగర్‌‌లో గల తన నివాసంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో మేం శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాం. కానీ మమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి బంగ్లాదేశ్, నేపాల్​లో జరిగిన నిరసనలతో పోలుస్తున్నారని అభిజీత్​ దీప్కే ఆరోపించారు. 

చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?

ప్రధాని మోదీని ఉద్దేశించి సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన విదేశీ విద్యకు సంబంధించిన ఆర్థిక పత్రాలను బహిరంగంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని.. మరి దేశాన్ని పాలిస్తున్న 'చక్రవర్తి (ప్రధాని మోదీ)' తన డిగ్రీ సర్టిఫికెట్​ను చూపెడతారా అని సవాల్ విసిరారు. దిప్కే విదేశీ చదువులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ శనివారం అధికారులకు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై దిప్కే సోమవారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా స్పందించారు. అమెరికాలోని బోస్టన్ వర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ పొందానని, మిగతా ఖర్చులకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా నని తెలిపారు. స్కాలర్‌షిప్ పత్రాలను, లోన్ రికార్డులను సైతం దీప్కే తన వీడియో ద్వారా చూపించారు. నీట్-పేపర్ లీక్ ఆందోళనల కారణంగానే తనపై, తన కుటుంబంపై కక్షసాధిస్తున్నారని దీప్కే ఆరోపించారు.