ఢిల్లీకి రానున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే

ఢిల్లీకి రానున్న  కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 6న నిరసన
  • ఆందోళనలో పాల్గొనాలని మద్దతుదారులకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఈ నెల 6న తాను భారత్‌‌‌‌‌‌‌‌కు రానున్నట్టు వెల్లడించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో త్వరలోనే శాంతియుత నిరసన చేపడతానని ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఈ నిరసనలో విద్యార్థులు, తన మద్దతుదారులు పాల్గొనాలని దీప్కే పిలుపునిచ్చారు. 

ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. " హలో అందరికీ. నేను ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. అవును. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడానికి నేను నా దేశానికి వస్తున్నాను. పేపర్ లీక్ కారణంగా కొంతమంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షలాది మంది విద్యార్థుల శ్రమ వృథా కావడంపై గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో గళం విప్పుతున్నాం. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ.. మనమందరం కలిసికట్టుగా, శాంతియుతంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది.  రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా మనమందరం కలిసికట్టుగా ఒత్తిడి తెస్తేనే మార్పు సాధ్యమవుతుంది" అని దీప్కే పేర్కొన్నారు.