భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అన్ని స్కూళ్లలో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు వాటిని సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ అనంతరం జిల్లా ఆఫీసర్లతో ఆయన రివ్యూ చేశారు. జిల్లాలోని స్కూల్స్, గురుకులాలు, హాస్టల్స్లలో మెనూ ప్రకారం ఆహారం అందడం లేదనే విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు.
మెనూ ప్రకారం స్టూడెంట్స్కు పౌష్టికాహారం అందించే విధంగా మండల స్పెషల్ఆఫీసర్లు, పాఠశాలలు, హాస్టల్స్ పర్యవేక్షణ ఆఫీసర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ ఫామెక్స్_2026 నిర్వహణపై జిల్లాస్థాయి కో ఆర్డినేషన్ కమిటీతో సమావేశం నిర్వహించి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
వరదలు, విపత్తుల టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్కూల్స్, కాలేజీలతో పాటు పరిశ్రమలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలుంటాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫామెక్స్ ప్రోగ్రాం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ బిటన్ సింగ్ పేర్కొన్నారు. జూలూరుపాడు పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన మందులు, పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు.
