పబ్లిక్ హెల్త్ లో హైదరాబాద్​ను ఆదర్శంగా చేద్దాం : అనుదీప్

పబ్లిక్ హెల్త్ లో హైదరాబాద్​ను ఆదర్శంగా చేద్దాం : అనుదీప్

హైదరాబాద్​, వెలుగు: ప్రజారోగ్యంలో హైదరాబాద్​జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో  సీనియర్ వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పీహెచ్ సీల డాక్టర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధులు వ్యాపించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని పేర్కొన్నారు.  

ఆశలు, ఏఎన్ఎంలు సైనికుల్లాగా పని చేయాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సమీక్షిస్తూ ప్రైవేట్ఆస్పత్రిలో ఐక్యూవి సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని వాటిపై రివ్యూ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణులు, అమ్మాయిల్లో రక్తహీనతకు కారణాలు, తీసుకునే చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే క్షయ కేసులపై సమీక్షకు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులతో రివ్యూ నిర్వహించాలని సూచించారు. 

హెచ్ఐవీ పేషెంట్లకు ఆసరా పింఛన్లు అందేలా చూడాలని, జిల్లాలో హెచ్ఐవీ హాట్ పాయింట్స్ గుర్తించి  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వ్యాక్సిన్లపై అన్ని పీహెచ్ సీలు  100% లక్ష్యం సాధించాలని సూచించారు. 102,108 వాహనాలపైనా సమీక్షించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, అదనపు జిల్లా వైద్యాధికారి జయమాలిని, జిల్లా టీబీ అధికారి కె. కల్పన, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీ కళ, ఐడీఎస్ పీ అధికారి డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ సుధా మాధవి, డాక్టర్ ఆశ్రిత, ఎస్ ఓ ఆనంద్,  రాములు, మలేరియా అధికారి నిరంజన్, సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆఫీసులు క్లీన్ గా ఉంచుకోండి

ప్రభుత్వ ఆఫీసులను లక్డీకాపూల్ లోని స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ లోకి తరలించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కలెక్టరేట్ లోని అన్ని విభాగాలు తమ ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పనికిరాని స్క్రాప్ ను తొలగించాలని, వాహనాలను సరిగా పార్క్​ చేయాలని, ఆ ఏరియాలోని చెత్తను తొలగించాలని ఆదేశించారు.  అన్ని విభాగాల ఆఫీసులను తిరుగుతూ పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులు సీపీఓ ఎన్.సురేందర్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ నాగలక్ష్మి, డీబీసీడీవో జి. ఆశన్న,డీఎస్ఓ ఆర్. కేశవులు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ కె. రమేష్, డీడబ్ల్యూవో నాగేశ్వర్ రావు, టీఎస్ సీ డబ్ల్యూ ఐ డీసీ డిప్యూటీ ఈఈ నర్సింహా రావు, డీడీ ఎస్సీ కార్పొరేషన్ పి. యాదయ్య, వివిధ శాఖల సిబ్బంది  ఉన్నారు. 

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని  కలెక్టర్ అనుదీప్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని కమల నెహ్రూ మహిళ పాలిటెక్నిక్, సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లోని చార్మినార్, యాకుత్ పురాల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. 

కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లను సమీక్షించుకోవాలని, ఏజెంట్లు, అధికారులు కౌంటింగ్ కేంద్రంలోనికి ప్రవేశించడానికి దారులు వేరువేరుగా ఉండేలా చూసుకోవాలన్నారు.  ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మహిపాల్ రెడ్డి, నాంపల్లి తహసీల్దార్ ప్రేమ్ కుమార్, సరోజినీ నాయుడు మహా విద్యాలయం ప్రిన్సిపాల్ శోభన ఉన్నారు.