గద్వాల, వెలుగు : చేనేత కార్మికుల కష్టాలను తీర్చి వారి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు అన్నారు. గురువారం గద్వాలలో నిర్వహించిన కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 1761 మంది కార్మికులకు రూ. 11 కోట్లు, వనపర్తి జిల్లాకు చెందిన 338 మందికి రూ. 2.5 కోట్ల విలువైన రుణమాఫీ చెక్కులను అందజేశారు.
‘నేతన్న భరోసా’ పథకం కింద 536 మంది కార్మికులకు రూ. 1.61 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన 32 మంది మృతుల కుటుంబాలకు నేతన్న బీమా కింద ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గద్వాల చేనేత జరీ చీరల వైభవాన్ని కాపాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.
చేనేత ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రజావాణిలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం నిర్వహించిన అభినందన సభలో గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో టాపర్లుగా నిలిచిన 125 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని అభినందించారు.

