బాదుడే బాదుడు..భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

బాదుడే బాదుడు..భారీగా పెరిగిన కమర్షియల్  సిలిండర్ ధరలు

ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి గ్యాస్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

 దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 42 పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ రేట్ ఏకంగా రూ. 3,113 కు చేరింది. దీనికి అదనంగా ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ. 11 పెంచారు. దీంతో దాని ధర రూ. 821లకు చేరింది.ఈ ధరల సవరణ ప్రభావం దేశంలోని ఇతర మెట్రో నగరాలపై కూడా తీవ్రంగా పడింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 53. పెరిగి.. రూ. 3,255కు చేరుకుంది. ఇక మన హైదరాబాద్  లో   పెరిగిన రేటుతో  కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3,357 గా ఉంది. 

అయితే హోటళ్లు, వ్యాపార సంస్థలకు ఈ పెంపు భారంగా మారినప్పటికీ... గృహ వినియోగదారులు ఉపయోగించే దేశీయ (డొమెస్టిక్) ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాటి ధరలు యథాతథంగా కొనసాగుతుండటంతో సామాన్య ఇళ్లకు కాస్త ఊరట లభించినట్లయింది. ఏదేమైనా, ఒకవైపు ఇంధన ధరలు, మరోవైపు కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరగడంతో హోటల్ తిండ్లు, ఇతర వ్యాపారాలపై దీని ప్రభావం పడనుండటంతో ప్రజలపై అదనపు భారం పడక తప్పేలా లేదు.