- ఇంటింటి చెత్త సేకరణ చేపట్టండి
హైదరాబాద్, వెలుగు: సిటీలో గార్బేజ్ పాయింట్లను ఎత్తివేసి ఇంటింటి చెత్త సేకరణ సమర్ధవంతంగా చేపట్టాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. శుక్రవారం మాదాపూర్ అయ్యప్ప నగర్ లో జీవీపీ తొలగించిన ప్రదేశాలను పరిశీలించారు. పర్వతపూర్ కాలనీకి వెళ్లి తనిఖీ చేస్తుండగా కాలనీ వాసులు చెత్త పట్టుకొని రావడంతో ఎస్ఎఫ్ఏపై కమిషనర్ మండిపడ్డారు. అక్కడికి వచ్చిన కాలనీ వాసులను చెత్త బయట వేయడానికి గల కారణాలను అడిగారు.
ఉదయం డ్యూటీ కి వెళ్తుండగా.. స్వచ్ఛ ఆటో రోజు వారీగా రాకపోవడంతో చెత్తను కుండీల్లో వేస్తున్నట్లు కమిషనర్‌కు వివరించారు . ఎస్ఎఫ్ఏ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్లను ఆదేశించారు. జూబ్లీహిల్స్ లోని గోశాలను సందర్శించి శానిటేషన్ అంశాలను పరిశీలించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ ఎన్ రోల్ మెంట్ క్యాంపెయిన్ పరిశీలన
ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దు కొనుటకు, ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకొనుటకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చినందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. కేబీఆర్ పార్క్ లో ఓటర్ ఎన్ రోల్ మెంట్ క్యాంపెయిన్ సెంటర్‌ను ఆయన సందర్శించి పరిశీలించారు. పార్కులో వాకర్స్‌ను అడిగి తెలుసుకుంటూ.. ఓటు ఉందా..
ఉంటే ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉందని సూచించారు. ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in/ ద్వారా గాని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో పరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు. మహిళ వాకర్‌తో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసి పరిశీలించారు. ఇయ్యాల ఉదయం 6 గంటలకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐ ఓటు ఫర్ స్యూర్ పేరుతో 5 కే రన్ నిర్వహించాలని రోనాల్డ్ రోస్ ఈఆర్వోలను ఆదేశించారు.
