న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్–2027కు టీమిండియాను సిద్ధం చేసేందుకు సెలెక్టర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను వన్డేల నుంచి తప్పించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించినట్లు సమాచారం.
అతని ప్లేస్‌లో బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లో ఒకరికి చాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. ప్రధాన వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను కొనసాగించనున్నారు. ఐపీఎల్–19లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్ 8 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 189 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన శాంసన్.. మెగా లీగ్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు.
సీఎస్కే తరఫున 8 మ్యాచ్‌ల్లో 304 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌లో అవకాశాలు తక్కువగా లభించినా.. శాంసన్ ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో 56.67 సగటుతో 510 రన్స్ చేశాడు. సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా 20 వన్డేలు ఆడనుంది.
జూన్ 14తో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో ఇవి మొదలుకానున్నాయి. ఇక్కడినుంచి పూర్తి స్థాయిలో ఇండియా వన్డే టీమ్‌ను రెడీ చేసేందుకు సెలెక్టర్లు సిద్ధమవుతున్నారు. అయితే వన్డేల నుంచి పంత్‌ను తప్పించినా.. టెస్ట్‌ల్లో మాత్రం కొనసాగించనున్నారు.

