V6 News

ఫీజు రీయింబర్స్మెంట్ ఇక స్టూడెంట్ల అకౌంట్లకే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం

ఫీజు రీయింబర్స్మెంట్ ఇక స్టూడెంట్ల అకౌంట్లకే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఇప్పటికే ఎస్సీ స్టూడెంట్లకు అమలు  
  • ఇక ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకూ వర్తింపు
  • అడ్మిషన్ల టైంలో ఫీజుల కోసం వేధించొద్దని కాలేజీలకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అందజేతలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు కాలేజీల అకౌంట్లలో జమ అవుతున్న ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డబ్బులు.. ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం (2026–27) నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నది.

ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు దీన్ని అమలు చేస్తుండగా, ఇక నుంచి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పద్ధతిలో ఫండ్స్ రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో స్కాలర్ షిప్​లు, ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ కింద మొత్తం 12.4 లక్షల మంది అప్లై చేస్తుంటారు. వీరికి ఏటా రూ.2,500 కోట్ల వరకూ అవసరం అవుతుంది. అయితే, ఇప్పటివరకూ టీజీపీఎస్సీ నిర్ణయించిన ఫీజులను వివిధ కేటగిరిల్లో ఫీజు రీయింబర్స్ మెంట్​ రూపంలో ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేస్తున్నది. 

అయితే, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కు అనుగుణంగా 2024 సెప్టెంబర్ నుంచే ఎస్సీ విద్యార్థుల మొత్తాన్ని నేరుగా ఆయా విద్యార్థుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే, ఇదే విధానాన్ని 2026–27నుంచి అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం చదువుతున్న వారు, 2025–26 విద్యా సంవత్సరం వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాత పద్ధతిలోనే కాలేజీలకే నిధులు చెల్లిస్తారు. పాత బకాయిల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థే కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

  • అడ్మిషన్ల సమయంలో ఫీజులు వసూలు చేయొద్దు..

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వస్తుంది కనుక, అడ్మిషన్ల సమయంలో కాలేజీలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని వేధించకూడదని సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వం విద్యార్థుల అకౌంట్లో నిధులు జమ చేసిన తర్వాత, విద్యార్థులే ఆ ఫీజును కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం డబ్బులు వేయకపోతే, ఆ బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుందని, విద్యార్థులను అడ్మిషన్ల దగ్గర ఆపకూడదని నిబంధన విధించారు.

  • ఆధార్ కీలకం.. 

కొత్త విధానం ప్రకారం స్కాలర్‌‌‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పొందాలంటే విద్యార్థులకు ఆధార్ గుర్తింపు తప్పనిసరి. విద్యార్థి పేరు మీద ఉన్న ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాకే ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు తమ ఆధార్ వివరాలను ఈకేవైసీ ద్వారా ధృవీకరించుకోవాలి. టెన్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులోని వివరాల్లో ఏవైనా తేడాలుంటే వెంటనే సరిచేసుకోవాలని సర్కారు సూచించింది. విద్యార్థులు ఈ పాస్ పోర్టల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. కేవలం ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది.

  • అటెండెన్స్ ఉంటేనే ఫీజులు..

స్టూడెంట్ల చదువుపై పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం ‘పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్’ మాడ్యూల్‌‌‌‌ను తీసుకొస్తోంది. ప్రతి కాలేజీలో ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తెస్తారు. ఈ హాజరు డేటాను నేరుగా ఈ పాస్ పోర్టల్‌‌‌‌కు లింక్ చేస్తారు. విద్యార్థులు క్లాసుల హాజరు శాతం, వారి అకడమిక్ ప్రోగ్రెస్ ఆధారంగానే స్కాలర్‌‌‌‌షిప్ నిధులను విడతల వారీగా విడుదల చేస్తారు. ఇందుకోసం ప్రతి కాలేజీలో ఒక ‘నోడల్ ఆఫీసర్’ను నియమించి, విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాయం చేయాలని సర్కారు ఆదేశించింది.

  • ఇక డిజిటల్ వెరిఫికేషన్..

వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘డిజిటల్ వెరిఫికేషన్’ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు ఇకపై సర్టిఫికెట్ల ఫిజికల్ కాపీలను కాలేజీల్లో సమర్పించాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలు, విద్యా సంస్థల డేటాను ఏపీఐ ద్వారా నేరుగా ఈ పాస్ వెబ్‌‌‌‌సైట్ పొందు పరుస్తుంది. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఆధార్‌‌‌‌తో అనుసంధానమై ఉన్నందున ఆన్‌‌‌‌లైన్ వెరిఫికేషన్ సులభతరం కానుంది. ఈ కొత్త మార్పులపై జిల్లా కలెక్టర్లు, సంక్షేమ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సర్కారు ఆదేశించింది.