భారతదేశంలో బుద్దుడి ద్వారా ఒక నూతన శాస్త్రీయ ఆలోచనా విధానం ఏర్పడింది. మూఢ విశ్వాసాలతో జీవనం సాగిస్తున్న ప్రజలకు బుద్ధుడు తన ధమ్మ విధానంతో ఒక జీవన మార్గాన్ని ప్రబోధించాడు. అతీంద్రియ శక్తులు అంటూ ఏవీ లేవని మనిషి మేధస్సే ప్రగతికి ఆధారమని, మనిషి సత్యంలో జీవించాలని బుద్ధుడు చెప్పాడు. ఏ విషయాన్నీ కూడా గుడ్డిగా నమ్మి ఆచరించవద్దని, నీకు నువ్వే ప్రత్యక్షంగా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఏదైనా ఆచరించాలని తెలిపాడు.
బుద్ధుడు కూడా స్వయం పరిశీలన ద్వారానే సత్యం కనుగొన్నాడు అదే బోధించాడు. బౌద్ధం ప్రకారం మానవుని స్థితి ఉత్తమోత్తమమైనది. మానవుడు తనకు తనే విధాత, అతని భవితవ్యం చెప్పడానికి దేవుడుకాని మరొక శక్తిగాని లేవు. సిద్ధార్థ గౌతముడు స్వయంగా ఎంతో కఠోర సాధన చేసి, తన స్వీయ అనుభవంతో బుద్ధుడు అయ్యాడు. డా. బి.ఆర్. అంబేద్కర్ రాసిన ‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ పుస్తకంలో ఒక సామాన్య మనిషి బోధిసత్వ మార్గంలో బుద్ధుడిగా మారడానికి దాటాల్సిన 10 దశలను వివరించారు. ఇవి మహాయానంలోని దశ భూములే. కానీ, అంబేద్కర్ వాటికి హేతుబద్ధమైన, సామాజిక కోణంలో వ్యాఖ్యానం ఇచ్చారు.
బుద్ధుడిగా మారడానికి 10 దశలు
1. ముదితా భూమి-సంతోష దశ. 2. విమలా భూమి-నిర్మల దశ. 3. ప్రభాకరీ భూమి-వెలుగు దశ. 4. అర్చిష్మతీ భూమి-మండే దశ. 5. సుదుర్జయా భూమి-జయించడానికి కష్టమైన దశ. 6. అభిముఖీ భూమి- ఎదురెళ్లే దశ.
7. దూరంగమా భూమి- చాలా దూరం వెళ్లే దశ. 8. అచలా భూమి- నిశ్చల దశ. 9. సాధుమతీ భూమి- మంచి బుద్ధి దశ. 10. ధర్మమేఘా భూమి-ధర్మపు మేఘం దశ. ఈ 10 దశలు ఏవో మాయలు, మంత్రాలు కావు. మనిషి తన నైతికత, జ్ఞానం, కరుణను పెంచుకుంటూపోతే బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు అంటే దేవుడు కాదు, పరిపూర్ణమైన మనిషి. ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది.
బుద్ధుని నాలుగు ఆర్య సత్యాలు
బుద్ధ ధమ్మానికి చతురార్య సత్యాలు జీవనాడులు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్‌లో మొదటిసారి తన పాత పంచ వగ్గీయ భిక్షువులకు ఇచ్చిన ఉపదేశమే ఈ నాలుగు ఆర్య సత్యాలు. 1. దుఃఖ ఆర్య సత్యం. - జీవితంలో దుఃఖం ఉంది. ఇక్కడ దుఃఖం అంటే కేవలం బాధ కాదు. అసంతృప్తి, అశాశ్వతత్వం, ఏదీ పూర్తిగా సంతృప్తినివ్వకపోవడం. 2. దుఃఖ సముదయ ఆర్య సత్యం. - దుఃఖానికి కారణం ఉంది. దుఃఖానికి మూల కారణం ‘తృష్ణ’ అంటే అంతులేని కోరిక.
ఈ కోరికల వల్లే మనం పదే పదే పుడుతూ, దుఃఖాన్ని అనుభవిస్తాం అని బుద్ధుడు చెప్పాడు. 3. దుఃఖ నిరోధ ఆర్య సత్యం. దుఃఖాన్ని ఆపవచ్చు. తృష్ణను పూర్తిగా వదిలేస్తే దుఃఖం ఆగిపోతుంది. దీన్నే ‘నిర్వాణం’ అంటారు. ఇది చనిపోయాక వచ్చేది కాదు. బతికి ఉండగానే పొందగల స్థితి. 4. దుఃఖ నిరోధ గామినీ ప్రతిపద ఆర్య సత్యం. - దుఃఖం పోవడానికి దారి ఉంది. నిర్వాణం చేరడానికి బుద్ధుడు చెప్పిన దారే ‘అష్టాంగ మార్గం’.
అష్టాంగ మార్గం
1. సమ్యక్ దృష్టి: నాలుగు ఆర్య సత్యాలను సరిగ్గా అర్థం చేసుకోవడం. 2. సమ్యక్ సంకల్పం: ద్వేషం, హింస వదిలి ప్రేమ, కరుణతో బతకాలని నిర్ణయించుకోవడం. 3. సమ్యక్ వాక్కు: అబద్ధాలు, చాడీలు, పరుష మాటలు మాని నిజం, మృదువుగా మాట్లాడడం. 4. సమ్యక్ కర్మాంతం: హింస, దొంగతనం, చెడు ప్రవర్తన మాని మంచి పనులు చేయడం.
5. సమ్యక్ ఆజీవం: ఇతరులకు హాని చేయని వృత్తితో బతకడం. 6. సమ్యక్ వ్యాయామం: చెడు ఆలోచనలు రాకుండా, మంచి ఆలోచనలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం. 7. సమ్యక్ స్మృతి: శరీరం, మనసు, ఆలోచనల పట్ల ఎరుకతో ఉండడం.
8. సమ్యక్ సమాధి: ధ్యానం ద్వారా మనసును ఏకాగ్రంగా నిలపడం. బుద్ధుడు తన బోధనల ద్వారా సర్వ జనహితంను కోరాడు. ఒక మనిషి ఉత్తమమైన మనిషిగా ఎలా మారగలడో నిరూపించాడు. కానీ, నేటి ఆధునిక సమాజం బౌద్ధాన్ని మతంగా భావిస్తూ దానిని అవలంబించాలంటే సామాన్యులైన స్త్రీ, పురుషులకు సాధ్యం కాదని, బౌద్ధాన్ని ఆచరించాలంటే అన్నింటిని వదలి బౌద్ధ విహారానికో, ఏకాంత వాసనికో పోవాలని అనుకుంటున్నారు. నిజానికి బౌద్ధం మతం కాదు. అది మానవ జీవన విధానం, బుద్ధధమ్మం ఎంతో గొప్పది, లోకోత్తర మైనది. అందరూ సులభంగా ఆచరించదగినది.
బుద్ధుని త్రి రత్నాలు
బౌద్ధంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగా ఈ మూడు రత్నాలను శరణు వేడతారు. వీటినే ‘త్రిశరణం’ అంటారు. ఇవి దారిచూపే దిక్సూచి లాంటివి. 1. బుద్ధం శరణం గచ్ఛామి. - బుద్ధుడిని శరణు వేడెదను. 2. ధమ్మం శరణం గచ్ఛామి. ధర్మాన్ని శరణు వేడెదను. 3. సంఘం శరణం గచ్ఛామి.- సంఘాన్ని శరణు వేడెదను. బుద్ధుని బోధనలను ఆచరిస్తున్న భిక్షువులు, భిక్షుణులు, ఉపాసకులు, ఉపాసికల సమూహాన్ని ఆశ్రయిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఈ మూడు రత్నాలను శరణు వేడడం. ఇది బౌద్ధుడిగా మారడానికి మొదటి అడుగు. అది మానవ జీవన విధానానికి తొలిమెట్టు.
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
ఎం. రవీందర్, స్టేట్ జనరల్ సెక్రటరీ (టీమ్)

