దేశంలో హోల్‌సేల్ మార్కెట్ లెక్కలు మారాయి. నిత్యావసర వస్తువుల నుంచి ఇంధనం వరకు ధరలు ఎలా మారుతున్నాయో లెక్కించే హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(WPI) పద్ధతిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై పాత 2011-12 బేస్ ఇయర్ స్థానంలో.. సరికొత్త 2022-23 బేస్ ఇయర్ అమల్లోకి రానుంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కొత్త సిరీస్‌ను లాంచ్ చేసింది. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మారిన ఈ కొత్త లెక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మే నెలలో హోల్‌సేల్ ఇన్ఫ్లేషన్ 9.68 శాతం..
కొత్త బేస్ ఇయర్ లెక్కల ప్రకారం ఈ ఏడాది మే నెలలో దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 9.68 శాతంగా నమోదైంది. అన్ని కమోడిటీల డబ్ల్యూపీఐ ఇండెక్స్ 109.9 వద్ద నిలిచింది. అయితే ఇందులో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఫ్యూయల్ & పవర్ కేటగిరీల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 30 శాతానికి దగ్గరగా నమోదు కావడం గమనార్హం. మాన్యుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ 7.48 శాతం, ప్రైమరీ ఆర్టికల్స్ 4.99 శాతం పెరిగాయి. క్రూడ్ పెట్రోలియం, మినరల్ ఆయిల్స్, కెమికల్స్, బేసిక్ మెటల్స్ ధరలు పెరగడమే ఈ హోల్‌సేల్ మంటకు ముఖ్య కారణంగా తేలింది. ఇక ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 4.49 శాతంగా ఉంది.
►ALSO READ | ఇక పెట్రోల్‌తో పనిలేదు.. దేశంలోనే తొలి 'ఇథనాల్' కారును తెచ్చిన మారుతి సుజుకి.. దీనివల్ల లాభాలేంటంటే !
ప్రభుత్వం కేవలం బేస్ ఇయర్ మార్చడమే కాదు.. ఇండెక్స్ బాస్కెట్‌ను కూడా భారీగా విస్తరించింది. ఒకప్పుడు కేవలం 697 వస్తువుల ధరలనే ట్రాక్ చేసేవారు. ఇప్పుడు ఆ లిస్ట్‌ను 957 వస్తువులకు పెంచారు. దేశం డిజిటల్, గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది కాబట్టి.. హిస్టరీలోనే మొదటిసారిగా సోలార్ పవర్, విండ్ పవర్, న్యూక్లియర్ ఎనర్జీలను ఈ బాస్కెట్లోకి చేర్చారు. అలాగే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ప్రైమరీ ఆర్టికల్స్ నుంచి తీసేసి.. 'ఫ్యూయల్ అండ్ పవర్' గ్రూప్‌లోకి మార్చేశారు.
IMF సూచనల ప్రకారం.. సరికొత్త గ్లోబల్ టెక్నిక్స్, గ్రోస్ వాల్యూ ఆఫ్ అవుట్‌పుట్ పద్ధతిని వాడుతూ వేర్వేరు కొత్త ఇండెక్స్‌లను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే పాత పద్ధతి నుంచి కొత్త ఫ్రేమ్‌వర్క్‌కు యూజర్లు అలవాటు పడటానికి వీలుగా.. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ డబ్ల్యూపీఐ సిరీస్‌ను ఇలాగే పబ్లిష్ చేస్తారు. టోటల్‌గా చెప్పాలంటే.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ప్రభుత్వం వేసిన ఈ 'న్యూ సిరీస్' మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు.
