ఆగస్ట్ 15 నుంచి స్విగ్గీ, జొమాటో బహిష్కరణ : హోటళ్ల వార్నింగ్ వెనక కారణాలేంటీ..?

ఆగస్ట్ 15 నుంచి స్విగ్గీ, జొమాటో బహిష్కరణ : హోటళ్ల వార్నింగ్ వెనక కారణాలేంటీ..?

హోటళ్లకు, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ కు మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. స్విగ్గీ, జొమాటో ప్లాట్ ఫామ్ లకు కటీఫ్ చెప్పేందుకు హోటల్స్ సిద్ధమవటం ఇండస్ట్రీ పరంగా ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆగస్టు 15 నుంచి బహిష్కరిస్తామని హోటల్స్, రెస్టారెంట్స్ ప్రకటించాయి. కోట్లాది మంది కస్టమర్లను ప్రభావితం చేసే ఈ వివాదం వెనుక కారణమేంటో తెలుసుకుందాం.

ఆగస్టు 15 తర్వాత డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆర్డర్‌లు స్వీకరించడం నిలిపివేస్తామని బెంగళూరులోని రెస్టారెంట్లు హెచ్చరించాయి. ప్లాట్‌ఫారమ్‌ లు ఇచ్చే   డిస్కౌంటింగ్, కమీషన్లు, ఇంకా అనేక ఇతర సమస్యలపై ఆందోళనల  పెరుగుతున్న క్రమంలో రెస్టారెంట్లు హెచ్చరికలు చేయడం ఆందోళన కలిగించే అంశం. 

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లతో రెస్టారెంట్లు దాదాపు 10 నెలలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో  జూలై 29, బుధవారం జరిగిన సమావేశంలో  బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (BHA)  ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.  కస్టమర్లకు అందిస్తున్న అధిక కమీషన్లు, ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందించే డిస్కౌంట్లు రెస్టారెంట్ల  లాభాలను తగ్గించాయని ఆరోపిస్తున్నారు. 

ఈ విధానం అటు రెస్టారెంట్లు, ఇటు కస్టమర్లు ఇద్దరినీ ప్రభావితం చేస్తుందని, ఫ్రీ లేదా డిస్కౌంట్లతో  కూడిన డెలివరీల విషయంలో కూడా, అవుట్‌లెట్‌లో చెల్లించే దానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వాదిస్తున్నారు. ఈ విధానం వలన రెస్టారెంట్లు, హోటళ్లు  నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. 

ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్లకు 15 రోజుల గడువు ఇచ్చామని బీహెచ్‌ఏ అధ్యక్షుడు పీసీ రావు తెలిపారు.  అలా చేయడంలో విఫలమైతే, ఇతర సంఘాలతో కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని  అన్నారు.

34 హోటళ్లు, రెస్టారెంట్లలో, దాదాపు 20 వేల వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదయ్యాయి. ఒకవేళ చర్చలు విఫలమైంతే.. ఆగస్టు 15 నుండి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లను స్వీకరించడం ఆపివేస్తాయి. దీనివల్ల వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అంటున్నారు.

ALSO READ : గూగుల్ జెమిని స్పార్క్: ఇకపై మీ పనులన్నీ అదే చూసుకుంటుంది!

రెస్టారెంట్ల ఆందోళనలకు తాము మద్దతు ఇస్తున్నామని, అయితే ఘర్షణకు బదులుగా చర్చలకే ప్రాధాన్యత ఇస్తున్నామని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)    పేర్కొంది. 

ఎందుకీ వివాదం:

ఇండియాలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలైన స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato)లకు.. రెస్టారెంట్ యాజమాన్యాలకు మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోంది.  ఆగస్టు 15 లోగా సమస్యలను పరిష్కరించకపోతే ఆప్‌లను బహిష్కరిస్తామని బెంగళూరులోని వేలాది రెస్టారెంట్లు డెడ్ లైన్ విధించాయి. దీంతో  ఈ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది.  

ఈ వివాదానికి కారణాలు:

అధిక కమిషన్లు: 
స్విగ్గీ, జొమాటో సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై 8 నుంచి 28 శాతం  వరకు భారీ కమిషన్లు వసూలు చేస్తున్నాయని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నాయి. 

ట్రాన్స్పరెన్సీ లేకపోటం:
 బిల్లింగ్‌లో యాడ్స్ ఛార్జీలు, పేమెంట్ గేట్‌వే ఫీజుల పేరిట అడ్డగోలుగా డబ్బులు కట్ చేస్తున్నారని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నాయి. లక్ష సంపాదిస్తే  40 వేల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని  హోటల్ అసోసియేషన్లు వాపోతున్నాయి. 

డిస్కౌంట్లు: 
రెస్టారెంట్ల అనుమతి లేకుండానే కస్టమర్లను ఆకర్షించడానికి ఆప్‌లు డిస్కౌంట్లు ఇస్తున్నాయని, ఆ భారాన్ని తమపైనే వేస్తున్నారని హోటల్ యజమానులు చెబుతున్నారు. 

డేటా మాస్కింగ్ : 
ఆర్డర్ చేసే కస్టమర్ల వివరాలను (పేరు, ఫోన్ నంబర్) ఆప్‌లు, రెస్టారెంట్లకు పంచుకోవు. ఈ డేటాను ఉపయోగించి ఆప్‌లు సొంతంగా క్లౌడ్ కిచెన్‌లను నడుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీని వలన రెస్టారెంట్లకు వచ్చే ఆర్డర్స్ తగ్గిపోతున్నట్లు ఆరోపిస్తున్నారు.