ఇక పెట్రోల్‌తో పనిలేదు.. దేశంలోనే తొలి 'ఇథనాల్' కారును తెచ్చిన మారుతి సుజుకి.. దీనివల్ల లాభాలేంటంటే !

ఇక పెట్రోల్‌తో పనిలేదు.. దేశంలోనే తొలి 'ఇథనాల్' కారును తెచ్చిన మారుతి సుజుకి.. దీనివల్ల లాభాలేంటంటే !

భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, దేశంలోనే మొట్టమొదటి 'ఫ్లెక్స్ ఫ్యూయల్' కారును మార్కెట్లోకి తెచ్చింది. అందరికీ బాగా తెలిసిన వాగన్ఆర్ మోడల్‌ను 'మారుతి సుజుకి వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్' పేరుతో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.24 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కారు 'ZXI+ MT FFV' అనే ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే
సాధారణంగా కార్లు పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తాయి. కానీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు పెట్రోల్‌తో పాటు ఇథనాల్ అనే  ఇంధనంతో కూడా నడుస్తాయి. ఈ వాగన్ఆర్ కారును 20% నుండి ఏకంగా 100% ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా కంపెనీ తయారు చేసింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ కారు ఇప్పుడప్పుడే 100% కాకుండా, E85 ఇంధనాన్ని (85% ఇథనాల్, 15% పెట్రోల్ మిశ్రమాన్ని) వాడటానికి అనుమతి పొందింది.

ఇథనాల్ అంటే 
ఇథనాల్ అనేది ఒక రకమైన బయో-ఇంధనం (Bio-fuel). దీనిని చెరకు రసం, ముక్కజొన్న, పాడైపోయిన ధాన్యం (వరి, గోధుమలు) వంటి వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేస్తారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువ. అంతేకాకుండా, ఇది పర్యావరణానికి చాలా మంచిది. దీనివల్ల వాహనాల నుండి వచ్చే కాలుష్యం భారీగా తగ్గుతుంది.

ఇథనాల్ బైక్స్ కూడా 
అవును, కేవలం కార్లే కాదు.. ద్విచక్ర వాహన రంగంలో కూడా ఇథనాల్ విప్లవం మొదలైంది. భారత మార్కెట్లో ప్రముఖ కంపెనీలైన టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) ఇప్పటికే ఇథనాల్‌తో నడిచే అపాచీ, పల్సర్ బైకులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించాయి. త్వరలోనే ఇవి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

రాబోయే రోజుల్లో
భారతదేశం ఇంధన అవసరాల కోసం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు (Crude Oil) పై ఆధారపడుతోంది. దీనికోసం వేల కోట్లు ఖర్చవుతోంది. రాబోయే రోజుల్లో ఇథనాల్ వాడకం పెరిగితే పెట్రోల్ ధరల భారం తగ్గుతుంది, సామాన్యుడికి ఇంధన ఖర్చులు తగ్గుతాయి. చెరకు, ఇతర పంటల వ్యర్థాలకు మంచి డిమాండ్ ఏర్పడి రైతుల ఆదాయం పెరుగుతుంది. నగరాల్లో గాలి నాణ్యత మెరుగవుతుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్ బంకులు పెరిగితే, మన రవాణా రంగం పూర్తిగా పర్యావరణ హితంగా మారిపోవడం ఖాయం!