కామన్వెల్త్ క్లోజింగ్ సెర్మనీలో భారత్ స్పెషల్ షో.. శంకర్ మహదేవన్, మానుషి చిల్లర్ సందడి!

కామన్వెల్త్ క్లోజింగ్ సెర్మనీలో భారత్ స్పెషల్ షో.. శంకర్ మహదేవన్, మానుషి చిల్లర్ సందడి!

Commonwealth Games 2026: ప్రపంచ క్రీడా ప్రపంచంలో భారత్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 2వ తేదీన గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో స్కాట్లాండ్ నుంచి అధికారికంగా కామన్వెల్త్ జెండాను భారత బృందం అందుకోనుంది. ఈ హ్యాండోవర్ వేడుకతో కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆతిథ్య బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించడమే కాకుండా, తదుపరి వేదికగా అహ్మదాబాద్ పేరును ప్రపంచానికి ఘనంగా చాటనుంది.  

20 నిమిషాల భారతీయ కళావైభవం: 
జెర్సీ మార్పులు, పథకాల వేట పక్కన పెడితే.. ముగింపు వేడుకల్లో భారత్ ప్రదర్శించబోయే 20 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన (India Handover Segment) ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనుంది. మన దేశ అపారమైన కళలు, సంస్కృతి, ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఈవెంట్‌ను రూపొందించారు. 

* పద్మశ్రీ శంకర్ మహదేవన్
* మాజీ మిస్ వరల్డ్, నటి మానుషి ఛిల్లర్  
* జానపద, ప్లేబ్యాక్ సింగర్ భూమి త్రివేది  
* సంగీత దర్శకులు సిద్ధార్థ్ మహదేవన్, శివం మహదేవన్
* అంతర్జాతీయ సితార్ విద్వాంసుడు రిషభ్ రిఖీరామ్ శర్మ  

 భారతీయ ఐక్యతను చాటేలా నృత్య ప్రదర్శన:

* వందేమాతరం 150వ వార్షికోత్సవ నివాళి: ప్రదర్శన ప్రారంభంలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక థియేట్రికల్ యాక్ట్ ఉండనుంది. మానుషి ఛిల్లర్ నేతృత్వంలో కళాకారుల బృందం భారతీయ ఐక్యతను చాటేలా నృత్య ప్రదర్శన ఇవ్వనుంది.  

* సితార్ - స్కాటిష్ పైప్స్ జుగల్‌బందీ: భారతీయ సితార్ విద్వాంసుడు రిషభ్ శర్మ, స్కాట్లాండ్ ప్రసిద్ధ పైపర్ రోస్ ఐన్స్‌లీ కలయికలో వచ్చే సంగీత జుగల్‌బందీ తూర్పు-పాశ్చాత్య సంస్కృతుల కలయికగా నిలవనుంది.

* గుజరాత్ సంస్కృతికి గ్రాండ్ ఫినాలే: 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న గుజరాత్ రాష్ట్రాన్ని గౌరవిస్తూ ముగింపు ఘట్టం సాగనుంది. శంకర్ మహదేవన్ తన కుమారులు సిద్ధార్థ్, శివమ్‌లతో కలిసి పాటలతో అలరించనుండగా, గుజరాతీ గాయని భూమి త్రివేది వారితో జతకట్టనుంది.  

* 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత భారత్ మళ్లీ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2030లో జరగబోయే ఈ శతాబ్ది ఉత్సవాల (Centenary Edition) సన్నాహాలకు గ్లాస్గో ముగింపు వేడుకలే గ్రాండ్ ఓపెనింగ్‌గా మారనున్నాయి.  

►ALSO READ | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్ vs బ్రెజిల్ మ్యాచ్‌ జరిగేది డౌటే..?