ఇథనాల్ లేకపోతే పెట్రోల్ 125 రూపాయలు అయ్యేది : E20 వల్ల ఇబ్బంది లేదన్న గడ్కరీ

ఇథనాల్ లేకపోతే పెట్రోల్ 125 రూపాయలు అయ్యేది : E20 వల్ల ఇబ్బంది లేదన్న గడ్కరీ

దేశ వ్యాప్తంగా ఇథనాల్ పెట్రోల్ వల్ల కార్లు, బైక్ ఇంజిన్లు పాడవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఏమీ లేవని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల క్రమంలో.. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని.. ఈ క్రమంలోనే ఇథనాల్ వల్ల ఆయిల్ కొరత తీర్చామన్నారు.

ఇథనాల్ పెట్రోల్ వల్లనే ధరలు నియంత్రణలో ఉన్నాయని.. ఇథనాల్ లేకపోతే పెట్రోల్ లీటర్ ఢిల్లీలోనే 125 రూపాయలు అయ్యేదని స్పష్టం చేశారాయన. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ ఇథనాల్ ను70 రూపాయలకే కొనుగోలు చేస్తుండటంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 95 రూపాయలుగానే ఉందని.. ఇథనాల్ లేకపోతే ఢిల్లీలోనే పెట్రోల్ లీటర్ 125 రూపాయలకు చేరుకునేందని పార్లమెంట్ లో వెల్లడించారు మంత్రి నితిన్ గడ్కరీ. 

దేశ వ్యాప్తంగా 23 కోట్ల వాహనాలు తిరుగుతున్నాయని.. ఇందులో 3 కోట్ల వాహనాలు ఇథనాల్ పెట్రోల్ వినియోగిస్తున్నాయని.. రెండున్నర సంవత్సరాలుగా 3 కోట్ల వాహనాలు ఇథనాల్ పెట్రోల్ తో నడుస్తున్నా.. ఇంజిన్లు ఫెయిల్ అయినట్లు.. పాడయినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు మంత్రి గడ్కరీ. 

ALSO READ : ఏదో ఒక రోజు ఏసీ గదుల్లోంచి బయటకు లాక్కొస్తాం

2025.. 26 ఆర్థిక సంవత్సరంలో.. దేశ వ్యాప్తంగా 2 కోట్ల 84 లక్షల వాహనాలు.., ఆయా కంపెనీల సర్వీసింగ్ సెంటర్లలో సర్వీస్ కు కోసం వచ్చాయని.. ఇందులో కోటి 50 లక్షలు పాత వాహనాలు ఉన్నాయన్నారు. ఆయా వాహనాల్లో E20 పెట్రోల్ వాడకం వల్ల ఆయా వాహనాల ఇంజిన్ కు ఎలాంటి నష్టం జరగలేదని.. విడి భాగాలు తప్పు పట్టలేదని.. మైలేజీ తగ్గలేదని ఆయా కంపెనీలు ఇచ్చిన డేటా ఆధారంగా వెల్లడిస్తున్నట్లు వివరించారు మంత్రి నితిన్ గడ్కరీ. పాత వాహనాల్లో రబ్బరు పార్ట్స్ మార్చుకుంటే సరిపోతుందని.. ప్రతి కంపెనీ సర్వీస్ కు వచ్చే పాత వాహనంలో E20 నిబంధనలకు అనుగుణంగా.. ఉచితంగా రబ్బరు పార్ట్స్ మార్చటం జరుగుతుందని పార్లమెంట్ సాక్షిగా భరోసా ఇచ్చారు మంత్రి నితిన్ గడ్కరీ. 

E10 వాహనాల్లో.. E20 పెట్రోల్ పోస్తే..!

E10 పెట్రోల్ సామర్ధ్యంలో తయారు చేసిన వాహనాల్లో.. E20 పెట్రోల్ పోయటం వల్ల 2 నుంచి 6 శాతం వరకు మైలేజీ తగ్గినట్లు అంగీకరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ మైలేజ్ తగ్గుదల సైతం.. వాహనదారుల డ్రైవింగ్ విధానం, వాహనాల నిర్వహణ వంటి అంశాలపై ఆధారపడి ఉందని వివరించారాయన.