- ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ: ఎంపీ వంశీకృష్ణ
- అందుకే ‘మాక్ పార్లమెంట్’తో ప్రజల గొంతు వినిపించాం
- జ్ఞానేశ్ కుమార్ తొలగింపు వరకు ఉద్యమం ఆగదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పుడల్లా మైక్ కట్ చేయడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అందుకే ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించి దేశ ప్రజల గొంతును వినిపించామని చెప్పారు. శనివారం రాజాజీ మార్గ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్లో వంశీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే గొంతు నొక్కుతున్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వేదికగా మారుతోంది” అని అన్నారు. గత నెల రోజులుగా విద్యార్థులపై దాడులు చేస్తూ, వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఓటు హక్కు, ఎన్నికల సమగ్రత కోసం పోరాటం
‘సర్’ప్రక్రియలో పారదర్శకతపై వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల చోరీకి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడటం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిలబెట్టడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును హరించే చర్యలను సహించబోమన్నారు. ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు.
