ఫారెస్ట్ ఆఫీస్ ​ఎదుట .. గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

ఫారెస్ట్ ఆఫీస్ ​ఎదుట ..  గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
  • అడ్డుకోవడంతో తప్పిన ప్రాణాపాయం 
  • భూ సమస్య పరిష్కరిస్తామని ఆఫీసర్లు రూ.2 లక్షలు తీసుకున్నరు 
  • బాధితుడి ఆరోపణ మెదక్​ పట్టణంలో ఘటన 

మెదక్, వెలుగు : ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం గంగాపూర్ తండాకు చెందిన విఠల్ అనే రైతు గురువారం మెదక్ లోని ఫారెస్టు రేంజ్ ఆఫీస్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడున్న వారు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. విఠల్ మాట్లాడుతూ తనకున్న భూసమస్య పరిష్కరిస్తానని కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు రూ.రెండు లక్షలు తీసుకొని మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారని ఆరోపించాడు. అప్పు చేసి డబ్బులిచ్చానని ఆవేదన చెందాడు. అంతేగాక ఫారెస్ట్ భూమి కబ్జా చేశావంటూ ఆర్డీవో ముందు బైండోవర్ చేస్తామని అంటున్నారని వాపోయాడు.

తాను చనిపోతే రైతు బీమా వస్తుందని, దానివల్ల అప్పులు తీరతాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తెలిపాడు. కొద్దిసేపటికి అక్కడున్న కొంతమంది అతడిని గవర్నమెంట్​హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకుని వచ్చిన అతడి కుటుంబసభ్యులు అక్కడి నుంచి ప్రైవేట్​హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ వివరణ కోరగా విఠల్ ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తున్నట్టు తెలిసి, అలా చేయవద్దని హెచ్చరించామన్నారు. గతంలో కూడా అతనిపై కేసు నమోదైందని తెలిపారు.