టాలీవుడ్ షేక్!!.. కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ

టాలీవుడ్ షేక్!!..  కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ

హైదరాబాద్: బెంగళూరులో నిన్నరాత్రి  నుంచి ఇవాళ తెల్లవారు జాము వరకు సాగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఎవరెవరున్నారంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. నటి హేమ కూడా రేవ్ పార్టీలో దొరికిందంటూ వార్తలు రావడంతో ఆమె రియాక్ట్ అయ్యారు. తాను హైదరాబాద్ లోని తన ఫాం హౌస్ లో ఫ్యామిలీతో ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితం హీరో శ్రీకాంత్ కూడా వీడియో రిలీజ్ చేశారు.  

‘నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్తల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్తలు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం. మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు’’ అంటూ పేర్కొన్నారు.

బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా మరో వైపు నెటిజెన్లు మాత్రం టాలీవుడ్ ప్రముఖులపై ఆరా తీస్తుండటం గమనార్హం.