ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి త్వరలో ప్రభాకర్ రావు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి త్వరలో ప్రభాకర్ రావు?

దర్యాప్తు ప్రదేశం మార్పిడిలో ఆంతర్యమేంటి?
ప్రశ్నించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారా
 కీలకంగా మారిన ఎస్ఐబీ మాజీ చీఫ్​ స్టేట్ మెంట్
ఆ తర్వాతే ముఖ్యమైన వ్యక్తుల అరెస్టుకు చాన్స్!

హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోట చేసుకుంది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు దర్యాప్తు జరిగింది. అయితే ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా జూబ్లీ హిల్స్ ఠాణాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ  చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే పోలీసులు లుక్ అవుల్ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ  రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు ప్రాసెస్ లో  ఉండగా చోటు చేసుకున్న కీలక పరిణామం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. అయితే దీనిని ప్రస్తుతం జూబ్లీహిల్స్ కు మార్చారు. ఠాణాలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో రద్దీ ఎక్కువంగా ఉంటుండటం.. విచారణకు ఇబ్బంది కరంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

 ట్రాన్సిట్ నోటీసు జారీ అయిన వెంటనే ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు అనుకూలంగా జూబ్లీహిల్స్ ఠాణాకు మార్చారని తెలుస్తోంది. ఇంటరాగేషన్ లో ఆయన చెప్పిన కీలక అంశాలను బేస్ చేసుకొని మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గత  ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను మాత్రమే ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే ప్రభాకర్ రావు నోరు విప్పితే కీలక అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ సారి రాజకీయ నాయకుల అరెస్టులు కూడా ఉంటాన్న చర్చ సాగుతోంది.