- 26లోపు పల్లెల్లో ప్రత్యేక గ్రామ సభలు పెట్టాలి: కేంద్రం
హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్): వీబీ జీ రామ్ జీ చట్టం–2025’పై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పీఆర్, ఆర్డీ శాఖల కార్యదర్శులు రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. ఈ కొత్త చట్టంలోని కీలక అంశాలు, ప్రజలకు సంక్రమించే చట్టపరమైన హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇందులో భాగంగా ఈ నెల 26లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్పెషల్ గ్రామసభ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సభల్లో గ్రామస్తులు, కూలీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు పాల్గొనేలా చూడాలని సూచించారు. సభలు పెట్టి చేతులు దులుపుకుంటే కుదరదని, గ్రామ సభ జరిగిన తీరును పక్కాగా డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. రియల్ టైమ్ జియో-ట్యాగ్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ‘పంచాయతీ నిర్ణయ్’యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పంచాయతీ రాజ్ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
