- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ముషీరాబాద్, వెలుగు: ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గతంలో కమ్యూనిస్టులపై ప్రశ్నలు లేవనెత్తినవారే ఇప్పుడు కష్టకాలంలో వారి మద్దతు కోరుతున్నారని పేర్కొన్నారు.
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ తగిన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వారికి కనీస వేతనం కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.
కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎండీ యూసుఫ్, రవిచంద్రన్, ఏసురత్నం, జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్ రావు, నరసింహా తదితరులు పాల్గొన్నారు.
