క్యాస్ట్ సర్టిఫికెట్లు పక్కదారి పడుతున్నయ్

క్యాస్ట్ సర్టిఫికెట్లు పక్కదారి పడుతున్నయ్

నల్గొండ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్​ సర్టిఫికెట్లు పక్కదారి పడుతున్నాయని, ప్రభుత్వ సర్వీసుల్లో, కాలేజీలు, స్కూళ్లలో వీటికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అన్నీ పరిశీలించి నిజమైన వారికే సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేషనల్​ ఎస్సీ కమిషన్​ మెంబర్​ కె.రాములు రెవెన్యూ అధికారులకు సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఎస్సీలు అనేక విషయాల్లో వెనుకబడే ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ ​స్కీములను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని మర్రిగూడలో ఎస్సీలకు చెందిన మడిగలను కూల్చేశారన్న ఫిర్యాదుపై.. ఆయన బాధితులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో చర్చించారు. వారంతా ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ శాఖ అనుమతితో పన్ను కడుతున్నారని, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మడిగలను కూల్చేశారని, 15 రోజుల్లో వారి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్​లో వార్డెన్, వాచ్ మెన్, వర్కర్ల ఇంటికి అక్రమంగా బియ్యం తీసుకెళ్తుండటంపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ స్టూడెంట్​ స్వాతిని వార్డెన్, ఇతరులు వేధిస్తున్నారని, దీనిపై పోలీసులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం పథకాలను అర్హులకు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ చెప్పారు. సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు.