ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిరిసిల్ల టౌన్, వెలుగు: విద్యార్థులు నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్​మాత్రలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సిరిసిల్ల కలెక్టర్ ​అనురాగ్​ జయంతి అన్నారు. గురువారం స్థానిక గీతా నగర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జడ్పీ చైర్​పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్​పర్సన్​ జిందం కళతో కలిసి కలెక్టర్​ మాట్లాడారు. 1 నుంచి19 ఏళ్ల  వయసుగల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రాలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుమన్ మోహన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,  ప్రభుత్వ వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

జమ్మికుంట : స్థానిక మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్​రావు, కమిషనర్​ సమ్మయ్య ఆధ్వ్యర్యంలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. మొత్తం 22 వేల మందికి గాను గురువారం 18,486 మంది పిల్లలకు మాత్రలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ స్వప్న, ఎంఈఓ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. 
మెట్ పల్లి: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గురువారం స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టూడెంట్లకు ఆల్బెండజోల్​టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీఓ వినోద్ కుమార్, బల్దియా చైర్ పర్సన్ రణవేనీ సుజాత తదితరులు పాల్గొన్నారు. 

చొప్పదండి: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా భూపాలపట్నం ప్రైమరీ స్కూల్లో జడ్పీటీసీ సౌజన్య, సర్పంచి లావణ్య, చొప్పదండిలో మున్సిపల్ చైర్​పర్సన్​ నీరజ, ఎంపీపీ రవీందర్, కొలిమికుంటలో తాళ్లపల్లి సుజాత పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేశారు. కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, టీచర్లు పాల్గొన్నారు.

‘నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం’

గోదావరిఖని, వెలుగు : సింగరేణి పరిసర, ప్రభావిత ప్రాంతాలు, గ్రామాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే సంస్థ ధ్యేయమని ఆర్జీ 1 ఏరియా జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.నారాయణ తెలిపారు. సుందిళ్ల, ముస్త్యాల, జనగామ గ్రామాలతోపాటు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12, 13 డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన 94 మంది యువకులకు స్థానిక ఒకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌(వీటీసీ)‌‌‌‌‌‌‌‌లో ఉచిత శిక్షణ ఇవ్వగా, వారికి జీఎం సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ వీటీసీలో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందిన వారికి ఎక్కడైనా ఉద్యోగావకాశం పొందే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కవితా సరోజిని, రజిత, రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముస్త్యాల సర్పంచ్ లావణ్య, ఆఫీసర్లు పాల్గొన్నారు.

99 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

మూడు వెహికల్స్​ సీజ్

వెల్గటూర్, వెలుగు : స్థానిక ఉమామహేశ్వర రైస్ మిల్లులో గురువారం అధికారులు దాడి చేసి పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంమేరకు దాడి చేసి నిల్వ ఉంచిన 99 క్వింటాళ్ల రేషన్ బియ్యం, రవాణా కు ఉపయోగించే  మూడు బొలెరో వెహికల్స్ ను సీజ్ చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి చందన్ కుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో డీటీసీఎస్ రాకేశ్ కుమార్, సీఎస్ఐ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

పొదుపు డబ్బులు ఇస్తలేరు 

మెట్ పల్లి, వెలుగు : పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేసిన డబ్బులు మెచ్యూరిటీ టైం పూర్తయి రెండేళ్లయినా  ఇవ్వకుండా సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ సంస్థ సతాయిస్తోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కథలపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఆలకుంట ఎల్లవ్వ, కొరిదెల విజయ, బొంత సుజాత, కొరిదేల ఎల్లవ్వ, వరపుప్పాల లక్ష్మి, ఆలకుంత అలివెల, కొరిదేల దేవితో పాటు పలువురు మహిళలు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ పల్లి కి చెందిన దశరథం అనే ఏజెంట్ ద్వారా 7 జనవరి 2017 నుంచి ప్రతీనెల రూ.1000, రూ.500 సహారా ఇండియా సంస్థలో పొదుపు చేశామన్నారు. డబ్బుల విషయమై మెట్ పల్లి ఆఫీస్ కు వెళ్లి అడిగితే తమకు ఏమీ తెలియదంటున్నారని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటే దిక్కున్న చోటు చెప్పుకోండని తెలిపారన్నారు. ఈ విషయమై సహారా ఇండియా మెట్ పల్లి బ్రాంచ్ మేనేజర్ ను ‘వెలుగు’ సంప్రదించగా స్పందించలేదు. కాగా సహారా ఇండియా సంస్థ మెట్ పల్లి బ్రాంచ్ పరిధిలో సుమారు 1200 ఖాతాదారులకు సుమారు రూ.10 కోట్లకు పైగా డిపాజిట్లు బాకీ ఉన్నట్లు తెలిసింది.

పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

జమ్మికుంట, వెలుగు : ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా పట్టణాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల చైర్మన్లు రాజేశ్వర్​రావు, రాధిక, కమిషనర్లు సమ్మయ్య, వెంకన్న, వరంగల్ ఆర్ జేడీ మైఖేల్ తో కలిసి ఆయన మాట్లాడారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు మాస్టర్​ప్లాన్ రూపకల్పన చేయాలని ఇంజనీరింగ్ అధికారులను శ్యాంప్రసాద్ లాల్​ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రణాళిక తయారు చేసి 10 రోజుల్లోగా అందించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్లు, దేశిని స్వప్న, కొలిపాక నిర్మల, తహసీల్దార్లు రాజేశ్వరి, కోమల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

బీజేపీ ఓబీసీ మోర్చా ఇన్​చార్జికి సన్మానం

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి ఇన్ చార్జి మంతెన కిరణ్ ను, బీజేపీ స్టేట్ లీడర్ గొట్టి ముక్కుల సురేశ్​రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం సన్మానించారు. పార్టీ పనులపై పెద్దపల్లికి వచ్చిన కిరణ్​ను సురేశ్​రెడ్డి బొకే, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయనతో సమావేశమై పార్టీ వ్యవహారాలు చర్చించారు. కార్యక్రమంలో వంగల రవిగోపాల్, కలికోట మోహన్, ప్రసన్న కృష్ణ, చిట్టవేని సదయ్య, కందుల రాజేందర్, వడ్లకొండ మహేశ్, వెగోళం శ్రీనివాస్, పెర్క రమేష్, ఆది సతీశ్ తదితరులు పాల్గొన్నారు. 

అంబేద్కర్ పేరుపెట్టడం అభినందనీయం

జగిత్యాల, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపెట్టడం హర్షణీయమని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. గురువారం జిల్లా జడ్పీ ఆఫీస్ లో ఆమె మాట్లాడుతూ సచివాలయానికి ప్రపంచ మేధావి పేరు పెట్టాలనే ఆలోచన సీఎం కేసీఆర్ చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళుతోందని, అనతి కాలంలోనే కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో తీర్మానించినట్టుగా నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

కేబుల్ బ్రిడ్జి పనులు త్వరగా చేయాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులతో కలసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు  పనులను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. రేయింబవళ్లు పనులు నడిచేలా అవసరమైన లేబర్ ను నియమించుకోవాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు పాల్గొన్నారు. 

వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరే

గంగాధర, వెలుగు: వ్యవసాయాన్ని పండగ చేసింది సీఎం కేసీఆరేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన గుంటి బీరయ్య అనారోగ్యంతో, ఆచంపల్లికి చెందిన ఆరె శ్రీనివాస్​ యాక్సిడెంట్​లో చనిపోగా వారి కుటుంబానికి రైతుబీమాకు సంబంధించినరూ.5 లక్షల ప్రొసీడింగ్ కాపీని గురువారం అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​గా నియమితులైన పొన్నం అనిల్​కుమార్​గౌడ్​ను సక్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనూరాధ-, సర్పంచ్ లు ఉన్నారు.

రూ.1.05కోట్లతో అభివృద్ధి పనులు

కరీంనగర్ కార్పొరేషన్, వెలలుగు: పట్టణంలోని 60వ డివిజన్ ముకరంపుర ఏరియాలో రూ.40లక్షలతో, 34వ డివిజన్ అంజనాద్రి టెంపుల్ లో రూ.65లక్షలతో పలు అభివృద్ధి పనులను మేయర్​సునీల్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముకరంపురలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కమార్ సహకారంతో నిధులకు ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ ఇస్లావత్ కార్పొరేటర్లు రమణారావు, బర్కత్ అలీ, హనుమంతరావు, శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు. 

పాడి కౌశిక్ రెడ్డి అబద్ధాలకోరు

హుజూరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ ద్రోహి పాడి కౌశిక్ రెడ్డి పెద్ద అబద్దాలకోరని, ఆయన ప్రవర్తనను ప్రజలు ఏవగించుకుంటున్నారని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.  హుజూరాబాద్​లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటలపై బురదచల్లాలని టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ద్రోహి కౌశిక్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి ఈటల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్, జిల్లా కార్యదర్శి కరుణాకర్, జిల్లా అధికార ప్రతినిధి ముత్యంరావు,  నాయకులు మల్లేష్ , తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గాయత్రిరెడ్డి డిజైనర్ స్టోర్ ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక గర్ల్స్ జూనియర్ కాలేజీ ఏరియాలో గాయత్రిరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టోర్ ను గురువారం గాయత్రిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ సిటీలో మొదటిసారి స్టోర్​ స్టార్ట్ చేశామని, హైదరాబాద్ లోని సైనిక్ పురి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ లో మూడు స్టోర్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా దసరా పండగ వరకు అన్నిరకాల కొనుగోళ్లపై 20 శాతం స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్సెస్ తో పాటు అన్ని  రకాల స్త్రీల వస్త్రాలు అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీతో అందిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి, నిర్మల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.