తిమ్మాపూర్, వెలుగు: కూతురుకు భూమి రాసిచ్చినా తన బాగోగులు చూడడం లేదని ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మచ్చిగాని అలియాస్ అలువాల ఎల్లవ్వ, మల్లయ్య దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
మల్లయ్య మృతిచెందిన తరువాత ఎల్లవ్వ ఒక కూతురు వద్ద నివసించేది. తనను చూసుకుంటానని చెప్పడంతో రెండు గుంటల భూమిని రాసిచ్చింది. భూమి రాసుకున్న తర్వాత కూతురు తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సోమవారం ఎల్ఎండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు భూమిని తిరిగి ఇప్పించాలని కోరింది. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్సై సయ్యద్ అన్వర్ వృద్ధురాలికి హామీ ఇచ్చారు.
