డిగ్రీ కోర్సుల్లో ‘ఆధిపత్య’ పోరు!..కమిషనరేట్ వర్సెస్ కౌన్సిల్.. అధికారుల మధ్య పెరిగిన ‘గ్యాప్’

డిగ్రీ కోర్సుల్లో ‘ఆధిపత్య’ పోరు!..కమిషనరేట్ వర్సెస్ కౌన్సిల్.. అధికారుల మధ్య పెరిగిన ‘గ్యాప్’
  • బీఓఎస్ అనుమతి లేకుండానే సర్కారు కాలేజీల్లో ఏఈడీపీ కోర్సులు
  • ఆ పర్మిషనే లేదనే సాకుతో ప్రైవేట్​లో ఆగిన ‘కౌన్సిల్’ కోర్సులు 
  • సమస్య పరిష్కారానికి చొరవ చూపని విద్యాశాఖ అధికారులు 

హైదరాబాద్, వెలుగు: డిగ్రీలో కొత్త కోర్సుల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మధ్య ఆధిపత్య పోరుతో కొత్త కోర్సులపై అయోమయం నెలకొన్నది. ఓ పక్క వర్సిటీ బీఓఎస్​ల (బోర్డ్​ఆఫ్​స్టడీస్) అనుమతి లేకపోయినా కమిషనరేట్​ రూపొందించిన ఏఈడీపీ (అకడమిక్ ఇండస్ట్రీ లింక్డ్ ప్రోగ్రామ్ ) కోర్సులను సర్కారు కాలేజీల్లో ప్రవేశపెట్టగా.. ఆ బీఓఎస్​ల అనుమతి లేదనే సాకుతో కౌన్సిల్ రెడీ చేసిన కోర్సులకు అనుమతి రావడం లేదు.

దోస్త్ రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గడువు దగ్గర పడుతున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంత జరుగుతున్నా సమస్య పరిష్కారానికి మాత్రం విద్యాశాఖ సెక్రటరీ ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త కోర్సుల్లో చేరాలనుకుంటున్న వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన మొదలైంది. యూనివర్సిటీల పాత్ర లేకుండా కొత్త కోర్సులపై కౌన్సిల్, కమిషరేట్ అధికారుల పెత్తనం ఏందని వర్సిటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 777 డిగ్రీ కాలేజీల్లో 3.60 లక్షల సీట్లు ఉండగా.. దోస్త్ ఫస్ట్ ఫేజ్​లో  కేవలం 56,147 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు అలాట్ అయ్యాయి. ప్రస్తుతం పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాత స్టైల్​లో ఉన్న 409 కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో కళాశాల విద్యాశాఖ మొత్తం 11 ఏఈడీపీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సైతం మరో 15 కోర్సులను తీసుకు రావాలని భావించింది. దీనిలో ఏఈడీపీ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రాగా కౌన్సిల్ కోర్సులు మాత్రం వివిధ కారణాలతో పెండింగ్​లో ఉన్నాయి.

పర్మిషన్ లేకుండానే ఏఈడీపీ కోర్సులు 

నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త కోర్సు ప్రవేశపెట్టాలంటే బీఓఎస్​అనుమతి తప్పనిసరి. కానీ కాలేజీయేట్ కమిషనరేట్ మాత్రం ఈ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గాలికొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బీఓఎస్ అనుమతులు లేకుండానే ఏఈడీపీ కోర్సులను సర్కారు డిగ్రీ కాలేజీల్లో పెట్టారు. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ రూపొందించిన కోర్సులను తాము పెట్టామని అధికారులు చెప్తుండగా, వర్సిటీ బీఓఎస్​ల అనుమతి తప్పనిసరి అని చెబుతున్నాయి. ఈకోర్సులనూ కేవలం సర్కారు కాలేజీలకే పరిమితం చేయగా.. ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదు. 

బీఓఎస్​ల పర్మిషన్ లేదని.. 

మరోవైపు టీజీసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ గత ఆరు నెలల నుంచి కొత్త కోర్సులపై భారీ కసరత్తు చేసింది. కాలేజీ మేజ్​మెంట్లు, వర్సిటీ వీసీలు, డీన్లతో అనేక విడతలుగా సమావేశాలు నిర్వహించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపొందించింది. తీరా వీటిని ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశపెట్టే సమయానికి వర్సిటీ బీఓఎస్ ల అనుమతి లేదని దోస్త్ పోర్టల్​లో చేర్చడం లేదనే వాదనలున్నాయి. ఏఈడీపీ కోర్సులకు లేని సమస్య..ఈ కోర్సులకు ఎందుకని కౌన్సిల్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కౌన్సిల్ రూపొందించిన కోర్సులను సర్కారు కాలేజీల్లో పెట్టడం లేదు. 

పెద్దల జోక్యం ఏదీ.? 

ప్రస్తుతం రాష్ట్రంలో దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ముగిసింది. ఇందులో కౌన్సిల్ రూపొందించిన కొత్త కోర్సులు ఎక్కడా కనిపించలేదు. మరో నాలుగైదు రోజుల్లో రెండో ఫేజ్ వెబ్ ఆప్షన్ల గడువు ముగియనుంది. అయినా సరే కొత్త కోర్సులపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. ఈ సమస్య తెలిసినా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు శాఖల అధికారులను సమన్వయం చేసి.. సమస్యల పరిష్కారంలో ఫెయిల్ అయ్యారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా కొత్త కోర్సుల పంచాయతీ తీర్చాలని విద్యాశాఖ వర్గాలు కోరుతున్నాయి.