టీచర్ల బదిలీల్లో గందరగోళం

టీచర్ల బదిలీల్లో గందరగోళం
  •     ప్రమోషన్​ వచ్చిన పాపానికి జిల్లా మారవట్టె..
  •     టీచర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం.. దూరమవుతున్న జంటలు
  •     ప్రమోషన్లు వచ్చినప్పటి నుంచే సీనియారిటీ కౌంటింగ్​
  •     ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్​ఫర్స్​అయినవాళ్ల సీనియారిటీని లెక్కించట్లే
  •     ఈ రెండు కేటగిరీల్లో జూనియర్ల కంటే  సీనియర్లు వెనక్కి 
  •     610 జీఓ ను అడ్డుపెట్టుకొని పలు జిల్లాల్లో అక్రమాలు 

వెలుగు నెట్​వర్క్: టీచర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ట్రాన్స్​ఫర్లకు సంబంధించి  గైడ్​లైన్స్​సరిగా లేకపోవడం, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత చేసిన సర్దుబాట్ల వల్ల ఏర్పడిన గజిబిజితో అర్హులు నష్టపోతున్నారు. 20 ఏళ్లు ఎస్జీటీగా పని చేసిన టీచర్​కు నాలుగేండ్ల కింద స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వస్తే నాలుగేండ్ల సీనియారిటీనే లెక్కిస్తున్నారు తప్పా.. మొత్తం సర్వీస్ ను కౌంట్ చేయడం లేదు. దీంతో వారు తమ తర్వాత సర్వీసులోకి వచ్చిన వారికన్నా లిస్టులో జూనియర్లుగా మారి, ఇతర జిల్లాలకు బదిలీ అవుతున్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్​ఫర్లపై వచ్చినవారి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. గతంలో  వేరే జిల్లాల్లో పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా ట్రాన్స్​ఫర్​పై వచ్చినప్పటి నుంచే సీనియారిటీ లెక్కిస్తున్నారు. అదే 610 జీవో ప్రకారం వచ్చిన వారికి మాత్రం అంతకు ముందున్న సర్వీస్ ను లెక్కిస్తున్నారు. దీంతో మూడు, నాలుగేండ్ల కింద ఈ జీవో ప్రకారం వచ్చిన వాళ్లు ఇక్కడ సీనియర్లుగా మారుతున్నారు. కొందరు యూనియన్ లీడర్లు డీఈఓ ఆఫీసుల్లో తిష్ట వేసుకుని లాబీయింగ్ చేస్తున్నారని, అంతర్ జిల్లాల బదిలీల్లో వచ్చిన వారికి కూడా రిమార్క్స్ కాలమ్ లో 610 జీవో కింద వచ్చినట్టుగా రాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు.. 
ఈసారి స్పౌజ్ ఆప్షన్ ఇవ్వకపోవడం, పూర్తి సీనియారిటీ కౌంట్ చేయకపోవడంవల్ల భార్య ఒక  జిల్లాకు, భర్త ఒక జిల్లాకు పోవాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన ఒక టీచర్ భార్య 2008లో నల్గొండ జిల్లాలో టీచర్ గా జాయిన్ అయ్యారు. 2012లో ఆమె ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ ఫర్​పై ఖమ్మం వెళ్లారు. 2012 నుంచే ఆమె సీనియారిటీ లెక్కించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. తర్వాత స్పౌజ్ కేటగిరిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే క్లారిటీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్​కు చెందిన టీచర్​ను పెళ్లి చేసుకున్న నిజామాబాద్ యువతి 2009 లో స్కూల్ అసిస్టెంట్​గాఎంపికయ్యారు. 2013లో ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల్లో భాగంగా ఆమె ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు. 2013 నుంచే ఆమె సర్వీసును లెక్కించడంతో అక్కడ జూనియర్ గా మారిపోయారు. దాంతో  భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసే అవకాశాన్ని కోల్పోయారు. 

ఏజెన్సీ టీచర్ల ఆందోళన 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు వేర్వేరుగా డీఎస్సీలు నిర్వహించారు. దీని ప్రకారం ఏ డీఎస్సీలో ఎంపికయినవారు అదే ఏరియాలో పనిచేయాలి. ఇప్పుడు సీనియారిటీ లెక్కన ట్రాన్స్​ఫర్​చేస్తుండడంతో మైదాన ప్రాంతంలో చేస్తున్న వాళ్లు ఏజెన్సీ ఏరియాకు, ఏజెన్సీలో ఉన్నవాళ్లు మైదాన ప్రాంతానికి బదిలీ అవుతున్నారు. దీనివల్ల ప్రమోషన్లలో తమకు అన్యాయం జరుగుతుందని ఏజెన్సీ ఏరియా డీఎస్సీల్లో ఎంపికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారు. 

మెడికల్ సర్టిఫికెట్ల గందరగోళం
మెడికల్ గ్రౌండ్స్ కింద ఐదు రకాల సర్జరీలు జరిగినవారికి 317 జీవో ప్రకారం బదిలీల్లో ప్రియారిటీ ఇస్తారు. క్యాన్సర్, లివర్, న్యూరో సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నవారికి ఈ ఆప్షన్ ఉంటుంది. అయితే కొందరు తప్పుడు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి తమకు కావాల్సి ప్రాంతానికి ట్రాన్స్​ఫర్​ చేయించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎండోస్కోపీ చేయించుకున్నవారిని కూడా హెల్త్ గ్రౌండ్ కింద అప్షన్లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కేసులను పరిశీలించడానికి డాక్టర్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఒంటరి మహిళలు, డైవోర్స్ తీసుకున్న మహిళలు, విడోలకు బదిలీల్లో ప్రియారిటీ ఇవ్వడంలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్​ఫర్లలో వారికి ఆప్షన్ ఉంటుంది. మెంటల్ రిటార్టెడ్ పిల్లలున్న వారి రిక్వెస్టులను ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్లలో వీరికి ఎంత శాతం వైకల్యం ఉందో తేల్చడం సాధ్యం కాదు. దాంతో డిజెబిలిటీ ఎంత పర్సెంటేజీ ఉందో పేర్కొనలేదన్న సాకుతో అలాంటి పిలల్లున్న పేరెంట్స్​ను దూరప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. రూ. 398 శాలరీతో చేరిన టీచర్లకు ర్యాకింగ్ లేకపోవడంతో వారిని ఏ ప్రాతిపదికన బదిలీ చేస్తారన్న స్పష్టత లేదు. గతంలో వీరి బదిలీలు రోస్టర్ పద్ధతిన జరిగాయి. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం జరగడంవల్ల ఇబ్బంది పడుతున్నారు.

భర్తకు హనుమకొండ .. భార్యకు ములుగు
హనుమకొండ కు చెందిన ఎం . శ్రీహరి 1996లో ఎస్జీటీగా డ్యూటీలో చేరి 2021 లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందారు . శ్రీహరి భార్య హేమలత 2008లో స్కూల్ అసిస్టెంట్ గా సెలక్ట్ అయ్యారు. ప్రస్తుత  జిల్లాల అలాట్మెంట్ లో శ్రీహరికి హనుమకొండ, హేమలత కు ములుగు కేటాయించారు. దీంతో తమ కుటుంబం పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని శ్రీహరి వాపోతున్నారు. 

భార్యాభర్తల్ని విడదీశారు
నేను, నా భార్య ప్రస్తుతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో పనిచేస్తున్నాం. స్పౌజ్ ఆప్షన్ ను పరిగణలోకి తోసుకోకపోవడంతో నన్ను జనగామ మండలానికి, నా భార్యను మహబూబ్ బాద్ జిల్లాకు ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో మా కుటుంబానికి ఇకపై ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అర్థం కావట్లేదు. భార్యాభర్తలను విడదీయడం అన్యాయం.
 -మడూరి వెంకటేశ్వర్లు, స్కూల్ టీచర్, జనగామ జిల్లా

ఇదేం న్యాయం? 
నేను 1998లో ఎస్జీటీగా అపాయింట్ అయ్యాను. 2013లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. 23 ఏండ్ల సర్వీస్ ఉండగా, ప్రమోషన్ వచ్చిన తర్వాత సర్వీసునే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో 16 ఏండ్ల  సర్వీస్ కోల్పోయి సొంత జిల్లా నుంచి వేరే జిల్లాకు పోవాల్సి వస్తోంది. ఇదెంత వరకు సమంజసం?  
 – జి.ఎన్.వి.ఆర్. మూర్తి, టీచర్, మెదక్