- అక్రమంగా తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును ఓడించింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- బీజేపీ.. బీసీ వ్యతిరేక, మనువాద పార్టీ
- 46 ఏండ్ల చరిత్రలో ఒక్క మహిళనూ అధ్యక్షురాలిగా నియమించలే
- కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని వ్యాఖ్య
- ఈ నెల 20న ‘పులి’ తిన్న మేత బయటపెడ్తామని కేసీఆర్‌ను ఉద్దేశించి కామెంట్
హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని, ఆ బిల్లు ముసుగులో అక్రమంగా తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే అడ్డుకొని ఓడించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, సోమవారం పార్లమెంట్ లో మహిళా బిల్లును విడిగా పెట్టాలని, అప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు. 2029 లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఉత్తరాదికి ఎక్కువ సీట్లు, దక్షిణాదికి తక్కువ సీట్లు ఇచ్చే మోదీ కుట్రకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారని అన్నారు.
శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ.. బీసీ వ్యతిరేక, మనువాద పార్టీ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 46 ఏండ్ల బీజేపీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారైనా మహిళను పార్టీ చీఫ్ గా నియమించలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల్లో మహిళా నాయకత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. మహిళలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఈ బిల్లు వీగిపోవాలనే కుట్రలో భాగంగానే బీజేపీ ఈ బిల్లు తెచ్చిందని ఆరోపించారు. బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మహిళలు తెలివైన వారని, మోదీలాంటి వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్తారని అన్నారు.
మహిళల్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్
మహిళల్ని గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, దేశానికి స్పీకర్, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల్లో సీఎంలుగా మహిళలను నియమించిన ఘనత కాంగ్రెస్ దేనని మహేశ్గౌడ్స్పష్టం చేశారు. మహిళా సాధికారత సోయి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, బీజేపీకి ఎక్కడిదని ఫైర్ అయ్యారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క బీసీ నాయకుడిని కూడా తయారు చేయలేదని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. దీనిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే.. బుద్ధి ఉన్న ఇక్కడి బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.
ఏ ఎన్నికల్లోనైనా శ్రీరాముడి పేరును, ఒవైసీ పేరును తీయకుండా బీజేపీ నాయకులు గెలవగలరా? అని ప్రశ్నించారు. ఈ నెల 20 న జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ సభను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ను పులి అంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. అదే రోజున పులి తిన్న మేత గురించి బయటపెడుతామని అన్నారు. ఆ పులి ఎన్ని ఆవులను, మేకలను తిన్నదనేది చెప్తామన్నారు. ఆ పులిని చూసి బీఆర్ఎస్ పిల్లులన్నీ ఎగురుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు ఆ పులి ఎన్ని బొక్కలు పెట్టిందో బయటపెడ్తామన్నారు.

