
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల చిచ్చు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. పీసీసీ కొత్త కమిటీలు, పార్టీ పరిస్థితిపై వాడీవేడీగా చర్చిస్తున్నారు. కొత్త కమిటీలపై ఢిల్లీ వెళ్లి ఏఐసీసీకి ఫిర్యాదు చేయాల్సిందేనని పలువురు నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాన్ని మహేశ్వర్ రెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డిప్యూజీ మాజీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి మాత్రం జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.
ఇటీవలె పీసీసీ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా 17 మందికి చోటు కల్పించారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు ఇచ్చారు. అయితే తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కొండా సురేఖ, బెల్లయ్య నాయక్ వంటి నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.