- బీఆర్‌ఎస్ లీడర్లు అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హాని జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు తగిన గౌరవం ఇస్తున్నామని, సీఎం తర్వాత రాష్ట్రంలో 55 మంది భద్రతా సిబ్బందితో అత్యధిక భద్రత ఆయనకే కల్పిస్తున్నామని చెప్పారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడి గాయపడినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు. అర్ధరాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూశారని చెప్పారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా సీఎం స్వయంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి తిరిగి సభకు రావాలని ఆకాంక్షించారని, అయితే బీఆర్‌ఎస్ నేతలే సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిరిసిల్లలో సీఎంకు పిండ ప్రధానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ బీఆర్‌ఎస్ నేతలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని, దళితులు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
దళితులను అవమానించడం సరికాదు
దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ధర్నా చేస్తే ఆ ప్రాంతం మైల పడుతుందా? పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది జాతి వివక్ష, అంటరానితనాన్ని ప్రదర్శించడమేనని అన్నారు. బీఆర్‌ఎస్ మొదటి నుంచి దళితులను అవమానించే విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. దళితుల నిరసనకు ప్రతిగా ఫామ్‌హౌస్ వద్ద ప్రాంతాన్ని శుద్ధి చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నేతలు పరుష వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. నిరసన తెలిపినందుకు గతంలో దళిత నేతలను సభ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. ఇలాంటి వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాలని కోరాం..
కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని మహేశ్ గౌడ్ కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ. కేసీఆర్ బాత్రూమ్‌లో జారిపడినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి తర్వాత కేసీఆర్‌కే రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పిస్తోందని మహేశ్ గౌడ్ వెల్లడించారు. దాదాపు 52 మంది పోలీసు అధికారులతో కేసీఆర్ సెక్యూరిటీకి సుమారు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు. హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణల వీడియోను ప్రదర్శిస్తూ, ఇంట్లోని రాజకీయ ఆధిపత్య పోటీ, కుటుంబ సభ్యుల అంతర్గత విభేదాలను కాంగ్రెస్‌కు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు పిండ ప్రదానం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి తీరు క్షమించరాని నేరం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి వ్యవహరించిన తీరు క్షమించరాని నేరమని ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. అసెంబ్లీ ప్రధాన గేటు ముందు సోమవారం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను కమిటీ పరిశీలించింది. ఈ ఘటనపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే సమావేశం నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఎథిక్స్ కమిటీ చైర్మన్ మహేశ్ గౌడ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో మహేశ్ గౌడ్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యులు నెల్లికంటి సత్యం, దేశపతి శ్రీనివాస్, మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు, డిప్యూటీ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు.
అసెంబ్లీ తీర్మానం, ఫిర్యాదులపై చర్చ..
తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ చేసిన తీర్మానంతోపాటు.. పలువురు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను కమిటీ పరిశీలించింది. ఈ అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన సూచనలపైనా చర్చించింది. సమావేశంలో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి వ్యవహరించిన తీరును దేశపతి శ్రీనివాస్ సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై కమిటీ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మరో సభ్యుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
