పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం: ఉత్తమ్

పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం: ఉత్తమ్

తెలంగాణ ఉద్యమంలో సాగునీరు పోరాటం జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. పోతిరెడ్డి పాడు విస్తరణ జరిగినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా… రాష్ట్రంలో ఆరుగురు TRS మంత్రులున్నారన్నారు. విస్తరణ సమయంలో ఇప్పుడు కీలకంగా ఉన్న వాళ్ళు అప్పుడు లేరని తెలిపారు. కానీ మంత్రిగా ఉన్న కేసీఆర్ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పై ఏం మాట్లాడలేదని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తో… కేసీఆర్ కుమ్మక్కయి కృష్ణ నీటిని ఆంధ్రాకు తీసుకుపోయేలా సహకరిస్తున్నారని తెలిపారు. జగన్..ఆరు నెలల క్రితమే పోతిరెడ్డి పాడు విస్తరణ గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జీఓ లు ఇచ్చి పనులు ప్రారంభించుకునేందుకు సిద్ధమైనా… కేసీఆర్ ఎలాంటి అడ్డు చెప్పక పోవడానికి కారణం ఏంటో చెప్పాలన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ఎండిపోతుందన్న ఉత్తమ్..పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా  పోతిరెడ్డిపాడు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి.