ప్రజా సమస్యలపై టీ కాంగ్రెస్ ఫోకస్

ప్రజా సమస్యలపై టీ కాంగ్రెస్ ఫోకస్

రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర సక్సెస్ అయినా, మునుగోడు మాత్రం కాంగ్రెస్ కు నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం జనరల్ ఎలక్షన్ కు మరో ఏడాది కాలం ఉంది. దీంతో హస్తం పార్టీ మరింత అలర్టైంది. రెగ్యులర్ గా ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతం చేస్తూ.. పబ్లిక్ ఇష్యూస్ పై పోరాటం చేయాలని డిసైడైంది. ఇందుకోసం పీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 

ప్రజా సమస్యలను సేకరించే పనిలో పీసీసీ

కాంగ్రెస్.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలను సేకరించే పనిలో పడింది. దాని కోసం పీసీసీ ప్రత్యేక కమిటీలు కూడా వేయాలని డిసైడైంది. ప్రతి కమిటీలో నియోజకవర్గ ఇంచార్జి, జిల్లా, రాష్ట్రస్థాయి నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రతి సమస్యలపై పోరాటం చేయాలని పీసీసీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇబ్బంది పడ్తున్నారు. లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. వాటిపై ఇప్పటికే పీసీసీ ఆధ్వర్యంలో ధరణి కమిటీ వేసి పోరాటం చేస్తోంది. పోడు భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పై కూడా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. ఇక ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, రైతు సమస్యలపైనా నేతలు గళం విప్పుతున్నారు. 

ఉద్యమాలు చేసేందుకు పీసీసీ ప్లాన్

పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, నిరుద్యోగ సమస్యలపై వరుస ఉద్యమాలు చేసేందుకు పీసీసీ ప్లాన్ చేస్తోంది. వీటితోపాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని భావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టుల భూసేకరణ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందలేదు. వారి పక్షాన నిలబడి ఉద్యమించాలని చూస్తోంది. ఇక విద్యార్ధి సమస్యలు, బీసీ మైనార్టీ సమస్యలపైనా పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 

పబ్లిక్ ఇష్యూస్ పై కాంగ్రెస్ పోరాటం

పబ్లిక్ ఇష్యూస్ తోపాటు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీల అమలుపైనా నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దళితబంధు, గిరిజన రిజర్వేషన్, గొర్ల పంపిణీ, నిరుద్యోగ భృతి లాంటివి ఎజెండాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది కాలమే ఉండటంతో ఇకపై పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.