పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరమే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. యువతను ప్రోత్సహిస్తూ నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మంగళవారం పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లు ఏర్పాటు చేయడం ద్వారా కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఒక్కో ఏటీసీ నుంచి 200 మంది చొప్పున ఏటా 25 వేల మందికి ఉపాధి లభించేలా ప్లాన్ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్ యువతను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు యువత కేసుల్లో ఇరుక్కునేలా ఆ పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ గులాబీ పిచ్చోడిలా మారారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీ వెంట నాయకులు సయ్యద్సజ్జాద్, బండారి సునీల్, బాలసాని సతీశ్తదితరులున్నారు.
