త్వరలో హైకమాండ్ కు డిగ్గీ రాజా నివేదిక.. రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులే తరువాయి ?

త్వరలో హైకమాండ్ కు డిగ్గీ రాజా నివేదిక.. రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులే తరువాయి ?

గాడితప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ను చక్కదిద్దే పనిలో పడింది ఆ పార్టీ అధిష్టానం. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. గ్రూపులుగా విడిపోయిన నేతలను ఏకతాటి పైకి తెచ్చే పనిలో పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన ఆయన... హైకమాండ్ కు 1, 2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులు

డిగ్గీ రాజా ఇచ్చే నివేదికతో రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం పార్టీలో జోరుగా వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ ను కొనసాగిస్తూనే.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను తప్పిస్తారని చాలామంది నేతలు భావిస్తునారు. ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా వచ్చి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ బలోపేతం పక్కన పెడితే.. నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో ఠాగూర్ విఫలమయ్యారనే టాక్ ఉంది. అలాగే నేతలు పార్టీ వీడకుండా చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. 

మాణిక్కం ఠాగూర్ పై విమర్శలు

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక సమయంలో.. ఠాగూర్ పై చాలా విమర్శలు వచ్చాయి. సీనియర్లు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వరని, ప్రతి విషయంలో రేవంత్ ను ఠాగూర్ ఎంకరేజ్ చేస్తారని సీనియర్లు చాలా సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు ఇదే విషయం చెప్పారు. దీంతో మాణిక్కం ఠాగూర్ ను తప్పిస్తే కానీ నేతల మధ్య సమన్వయం రాదని హైకమాండ్ కు డిగ్గీ రాజా చెప్పనట్టు సమాచారం. మరోవైపు మాణిక్కం ఠాగూర్ కూడా తెలంగాణ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు తన మాట వినడం లేదని ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ కు ఠాగూర్ చెప్పినట్టు సమాచారం. 

 తెలంగాణకు ఇంచార్జిగా సీనియర్ నేత

ఠాగూర్ ను మారిస్తే ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారనేది ఆసక్తిగా మారింది. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ఇంచార్జిగా రావడం కష్టమేనని టాక్. ఉమ్మడి రాష్ట్రానికి ఇంచార్జికి ఉన్న ఆయన తెలంగాణకు మాత్రమే పరిమితం కావడాన్ని ఇష్టపడకపోవచ్చని సమాచారం. ఉత్తర భారతదేశానికి చెందిన ఇద్దరి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు ఇంచార్జిగా సీనియర్ నేతనే పంపాలని అధిష్టానం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. హర్యానాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రణదీప్ సుర్జేవాలా లేదా అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పన్నాలాల్ పునియా పేరు బలంగా వినిపిస్తోంది. సుర్జేవాలా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఏప్రిల్ లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన్ని అక్కడి నుంచి తప్పించి ఇక్కడికి వేస్తారా.. అనేది అనుమానమే.

ముగ్గురు నేతల్లో ఎవరో ఒకరు ఇంచార్జిగా..  

ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన పునియా యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చి మంచి గుర్తింపు పొందారు. 2018లో చత్తీస్ గఢ్ ఎన్నికల సమయంలో ఇంచార్జిగా పనిచేశారు. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని టాక్. పునియా కాదంటే.. మరో నేత పేరు కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు నేతల్లో ఎవర్నో ఒకరిని ఇంచార్జిగా నియమిస్తారని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది.