మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే.. ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లలో పార్టీ ఇన్చార్జ్లదే ఫైనల్

మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..  ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లలో పార్టీ ఇన్చార్జ్లదే ఫైనల్
  • కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
  • అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయ లోపంతో సునాయసంగా గెలిచే గ్రామాలను కాంగ్రెస్ చేజార్చుకోవడం, బీఆర్ఎస్ ఊహించిన దానికన్న ఎక్కువ పంచాయతీలు దక్కించుకోవడంతో పీసీసీ నాయకత్వం తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్నది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థులు, ఎంపికలో, మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకే కీలక బాధ్యతలు అప్పగించింది. ఇక ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్​చార్జ్​లదే తుది నిర్ణయం కానున్నది. అయితే, ఈ ఎంపికలో అర్హులైన పార్టీ నాయకులకు న్యాయం జరిగేలా సమన్వయం చేసే బాధ్యతను ఆయా జిల్లాల డీసీసీ చీఫ్ లకు అప్పగిస్తూ పీసీసీ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది.

ఆ 10 నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిటీలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ పది మంది ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత.. కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను వేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ పరంగా నెలకొన్న సమస్యలకు చెక్ పడ్డట్లేనని పీసీసీ నాయకత్వం భావిస్తున్నది. మిగిలిన నియోజకవర్గాల్లో అర్హులైన పార్టీ నేతలను మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలపడంపై స్థానిక ఎమ్మెల్యేలు, వారు లేనిచోట పార్టీ ఇన్​చార్జీలు కసరత్తు ప్రారంభించారు.

ప్రధానంగా ఈ ఎన్నికల్లో రెబల్స్ బెడద లేకుండా ముందుగానే పార్టీ నేతలు సమన్వయం చేసుకోవడంపై జిల్లా స్థాయిలో మంత్రులు, డీసీసీ అధ్యక్షులు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు ఇటు మంత్రులు అటు డీసీసీ చీఫ్ లు పార్టీ ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ ఇన్​చార్జ్​లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రతి డివిజన్, వార్డు నుంచి ఆరుగురు ఆశవహుల పేర్లను సిద్ధం చేయాలని కోరారు.

రిజర్వేషన్లకు అనుగుణంగా.. 

రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా సామాజికవర్గాల నాయకులకు టికెట్లు ఇచ్చేందుకు వీలుగా ప్రతి డివిజన్, వార్డు నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళ, ఓసీల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలను, పార్టీ ఇన్​చార్జ్​లను మంత్రులు ఇప్పటికే ఆదేశించారు. వీరిని సమన్వయం చేసుకోవడంపై డీసీసీ అధ్యక్షులు దృష్టిపెట్టారు. అయితే, టికెట్ ఎంపికలో ఎమ్మెల్యేలు, వారు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్​చార్జ్​లదే కీలక పాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు టికెట్లు కోసం వీరి చుట్టూ ఇప్పటి నుంచే ప్రదక్షిణలు చేస్తున్నారు.