రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు

రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు

రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ నేత మల్లురవి విమర్శించారు. ఆయనకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చిందని.. అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని వీడారని మండిపడ్డారు. బీజేపీలో చేరడానికే మోడీ, అమిత్ షాను పొగుడుతున్నారని..కాంగ్రెస్ లోనే ఉంటూ బీజేపీకి పనిచేశారని ఆరోపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ పనితీరుకు మెచ్చి అధిష్ఠానం పీసీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటకు కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెబుతారని..పార్టీలో ఎవరు సంతోషంగా లేరని చెప్పడం అబద్దమన్నారు.

కాంగ్రెస్ గాలికి అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని మల్లు రవి అన్నారు.  రేవంత్ పీసీసీ అయ్యాక దళిత గిరిజన సభలు, జంగ్ సైరన్ లు చేశాడన్నారు. రైతు డిక్లరేషన్ విడుదల చేశాం..త్వరలో సిరిసిల్లలో యూత్ డిక్లరేషన్ ను విడుదల చేస్తామన్నారు. ఇందిరా గాంధీ హయాంలో జనతా పార్టీలో చేరిన వారంతా శంకరగిరి మాన్యాల్లో కలిసి పోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ను విడిచిపెట్టిన వాళ్లకు అదే గతిపడుతుందని..ఈటెల కూడా రేవంత్ పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం బాధాకరమన్నారు.