V6 News

గాంధీభవన్ ముందు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం

గాంధీభవన్ ముందు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం
  • బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు
  • వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. గురువారం ఖైరతాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో తేజస్వి దిష్టి బొమ్మను తగలబెట్టి ఆయనకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తేజస్వి మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమేనని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా.. కడుపుమంట అని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం తేజస్వి అజ్ఞానాన్ని బయటపెడుతుందన్నారు. తేజస్వి మాట్లాడిన మాటలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 1,600 మంది తెలంగాణ అమరులను అవమానపరిచేలా ఆయన మాటలు ఉన్నాయని మండిపడ్డారు. 

తేజస్వి సభ్యత్వాన్ని రద్దు చేయాలి: అద్దంకి

తెలంగాణపై విషం కక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై లోక్‌‌‌‌సభ స్పీకర్ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, పార్లమెంట్ రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించాలని కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణపై తేజస్వి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తేజస్వి సూర్యను బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ శంకర్ డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు.