- ఈ రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే.. దీంతో ఢిల్లీ స్థాయిలో సీనియర్ల లాబీయింగ్
- రేసులో సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో పాటు కేకే, జానా రెడ్డి,
- జీవన్, నేరెళ్ల శారద, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, హర్కర, చిన్నా రెడ్డి మరికొందరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఏప్రిల్ లో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానుండడంతో వీటిని దక్కించుకునేందుకు తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి, కే కేశవరావు రాజీనామాతో ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యత్వం పొందిన కాంగ్రెస్ జాతీయ నేత అభిషేక్ మను సింఘ్వీ .. ఈ ఇద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9 తో ముగియనుంది.
ఈ రెండు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోనే చేరనున్నాయి. రాష్ట్రం నుంచి మొత్తం ఏడు రాజ్యసభ సీట్లు ఉంటే అందులో బీఆర్ఎస్ కు నాలుగు కాంగ్రెస్ కు మూడు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేశ్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ మను సింఘ్వీ ఉన్నారు.
అయితే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చేరోటి ఖాళీ కానుండడంతో ఈ రెండు కాంగ్రెస్ ఖాతాలోకే చేరనున్నాయి. రాష్ట్ర నుంచి లోక్ సభకు బీఆర్ఎస్ నేతల ప్రాతినిథ్యం లేకపోవడంతో ఖాళీ కానున్న ఈ రెండు రాజ్యసభ స్థానాలను సునాయసంగా కాంగ్రెస్ గెలుచుకోనుంది. దీంతో కాంగ్రెస్ బలం నాలుగుకు పెరగనుండగా, బీఆర్ఎస్ బలం మూడుకు పడిపోనుంది.
ఎవరిని వరించెనో
అయితే ఈ రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల చివర్లో లేదా మార్చి మొదటివారంలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ రెండు పదవులు ఎవరిని వరించనున్నాయనే చర్చ పీసీసీలో సాగుతున్నది. పలువురు రేసులో ఉన్నట్టు గాంధీ భవన్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీకే తిరిగి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు పీసీసీ నాయకత్వం భావిస్తున్నది.
ఆయన పేరున్న న్యాయవాది కావడంతో రాష్ట్రంలో ఉన్న పలు కేసులకు సంబంధించి ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే సుప్రీం కోర్టులో ఉన్న పలు కేసులు వాదించనుండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, పీసీసీకి ఆయన అవసరం ఎంతో ఉంది. అందుకే రాజ్యసభ సీటును తిరిగి ఆయనకే రెన్యూవల్ చేయడం ఖాయంగా తెలుస్తున్నది.
రేసులో డజను మంది
ఇక మిగిలిన ఒక్క సీటు కోసం డజనుకుపైగా కాంగ్రెస్ నేతలు రేసులో ఉన్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందు రాజ్యసభ సభ్వత్వాన్ని వదులుకున్న కే కేశవరావు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తన కోరికను సీఎంతో పాటు పలువురి ముందు వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎంపీ, మరోకరు ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనకు ఈ పదవి ఇచ్చేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా అనే చర్చ కూడా పార్టీలో సాగుతున్నది.
ఇక మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఈ పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆయన కూడా రాజకీయంగా ఒక్కసారైనా ఎంపీగా ఉండాలనే తన బలమైన కోరికను పలు సందర్భాల్లో పార్టీ నేతల ముందు వ్యక్తపరిచారు. రాజ్యసభ సీటుపై స్పష్టమైన హామీని జీవన్ రెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా ముద్రపడ్డ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ కూడా ఈ రేసులో ఉన్నారు.
మహిళా కమిషన్ రాష్ట్ర చైర్ పర్సన్ నేరెళ్ల శారద పదవీకాలం త్వరలో ముగియనుండడంతో ఆమె కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బ్రహ్మణ కోటాలో మరో సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఒక్క సీటును హైకమాండ్ ఎవరకి ఇవ్వనుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొంది.
