- ధాన్యం కొనుగోలులో జాప్యంపై నిరసన
మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లాకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సంచిలో వడ్లు తీసుకొచ్చి కింద పోసి నిరసన తెలిపారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఆత్మాహుతి చేసుకుంటానంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బా మూత ఓపెన్ చేయగా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ఈగ రాజు మాట్లాడుతూ వరి కోతలు మొదలై చాలా రోజులైనా, కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చినా తూకం వేయడంలేదన్నారు.
లారీలు రాక ధాన్యం మిల్లులకు తరలించడంలేదన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నా కలెక్టర్ పట్టించుకోవడం లేదని, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్ ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చి మాట్లాడారు. అన్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ హామీ మేరకు కాంగ్రెస్ నాయకులు, రైతులు ఆందోళన విరమించారు.
