జూన్ 25న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

జూన్ 25న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్​ నేతలకు పార్టీ హైకమాండ్​ నుంచి పిలుపొచ్చింది. ఆదివారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్​నగర్​ జిల్లాలకు చెందిన నేతలు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్​ఎస్​బహిష్కృత నేతలు పొంగు లేటి శ్రీనివాస్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం రాహుల్​ గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తున్నది.  

సీనియర్ల ఇంటికెళ్లిన ఠాక్రే

పలువురు కాంగ్రెస్​ సీనియర్​ నేతలు  పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల నేపథ్యంలో హైకమాండ్​ అలర్ట్​ అయినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సీని యర్ల ఇండ్లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే వెళ్లి సమావేశమయ్యారు. మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జగ్గారెడ్డితో ఆయన చర్చలు జరిపారు. అయితే, తాను పార్టీ మారాలనుకోవట్లేదని ఠాక్రేకి ఉత్తమ్​ స్పష్టం చేసినట్టు సమాచారం. తనపై కూడా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని జానారెడ్డి అన్నట్లు తెలిసింది.  

రేవంత్​ సమక్షంలో చేరికలు

శనివారం పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​, బీజేపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు రేవంత్​ ఇంట్లో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.