రేపు సీఎస్​ను కలవనున్న కాంగ్రెస్ నేతలు

రేపు సీఎస్​ను కలవనున్న కాంగ్రెస్ నేతలు
  • వచ్చే నెల 5 వరకు వరుస కార్యక్రమాలు
  • 24న మండలాలు, 30న నియోజకవర్గాల్లో నిరసనలు
  • ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష
  • జూమ్ మీటింగ్​లో కాంగ్రెస్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : రైతు సమస్యలపై కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు చేపట్టనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్​మీటింగ్ లో కార్యాచరణను ప్రకటించారు.  ఈ మీటింగ్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్  కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్​, చైర్మన్ లు దామోదర రాజ నర్సింహ, పీసీసీ మాజీ  అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావీద్, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి, మల్లు రవి, నిరంజన్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5 వరకు పోరాటాలు చేపట్టాలన్నారు.  21న రైతు సమస్యలపై సీఎస్ సోమేశ్​కుమార్ కు వినతిపత్రం సమర్పించాలన్నారు. 24న మండల స్థాయిలో, 30న నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వచ్చే నెల 5న  అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.  ఆ తరువాత ఇందిరా పార్క్ దగ్గర 2 రోజులు దీక్ష చేపట్టాలన్నారు.  జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనాలని సూచించారు.

ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నయి

రాష్ట్రంలో పబ్లిక్ సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ, టీఆర్ ఎస్ కొన్ని వివాదాస్పద అంశాలను చర్చకు పెట్టి నాటకాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా నయీం, డ్రగ్స్, ఆర్టీసీ కార్మికుల ధర్నాలను వివాదాస్పదం చేశాయన్నారు. వెస్ట్ బెంగాల్ తరహా పాలిటిక్స్ తెలంగాణ లో చేయాలని ట్రై చేస్తున్నరని ఆరోపించారు.  పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ, టీఆర్​ఎస్​ డ్రామాలు చేస్తున్నాయని, దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పీసీసీ చీఫ్ తెలిపారు. 

జూమ్ మీటింగ్​కు జగ్గారెడ్డి డుమ్మా

పీసీసీ నిర్వహించిన జూమ్ మీటింగ్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. గాంధీ భవన్ లో మీటింగ్​ పెట్టకుండా ఈ జూమ్​ మీటింగ్​ఎందుకని జగ్గారెడ్డి మండిపడ్డారు. తనకు ఫోన్ చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ లో ఇదే విషయం చెప్పినట్లు తెలిపారు.  కాగా,  ఏఐసీసీ సెక్రటరీ జావేద్ జగ్గారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.

కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెండ్‌‌

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్‌‌ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను కాంగ్రెస్‌‌ నుంచి ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణలతో కలిసి బీజేపీలో చేరడంపై చర్చలు జరిపారని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారని చెప్పారు. దీనిపై క్రమశిక్షణ కమిటీలో చర్చించి, ఆయనను సస్పెండ్‌‌ చేసినట్లు చిన్నారెడ్డి తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ వ్యవహార శైలి మార్చుకోవాలని శనివారం ఢిల్లీలో శశిధర్ రెడ్డి ఆరోపించారు.